Raghuram Rajan: 'సొంత బ్రాండ్‌ను సృష్టించడంలో విఫలమయ్యాం': రఘురామ్ రాజన్

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా భారత గుర్తింపును ఇవ్వగలిగే ఒక్క ఉత్పత్తిని కూడా మనం సృష్టించలేదు.

Raghuram Rajan: సొంత బ్రాండ్‌ను సృష్టించడంలో విఫలమయ్యాం: రఘురామ్ రాజన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించే దశలో భారత్ ఉండవచ్చు, కానీ గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ హోదా ఆ మైలురాయిని చేరడం అసాధ్యమని మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన ఓ కాలమ్‌లో రఘురామ్ రాజన్.. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో భారీగా మద్దతు ఉన్నప్పటికీ, ప్రపంచ ఉత్పత్తులను సృష్టించడంలో మనదేశం స్పష్టమైన వైఫల్యాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత గుర్తింపును ఇవ్వగలిగే ఒక్క ఉత్పత్తిని కూడా మనం సృష్టించలేదు. సోనీ, టయోటా, మెర్సిడెస్ బెంజ్, పోర్సే లాంటి బ్రాండ్లు లేవు. అధిక సుంకాలు విధించే కార్ల మార్కెట్ దేశంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ ఒక్క భారతీయ కార్ మోడల్ భారీగా అమ్ముడుపోయిన సందర్భం లేదని రాజన్ అభిప్రాయపడ్డారు. బదులుగా, భారతీయ వాహనాలు తక్కువ ధరతో కూడిన మార్కెట్లకే పరిమితం అయ్యాయని అన్నారు. భారతీయ ఔషధ సంస్థలకు ప్రపంచస్థాయిలో ఉనికి ఉన్నప్పటికీ, జనరిక్స్ నుంచి ఒరిజినల్ ఫార్ములేషన్‌లకు మారడంలో విఫలమయ్యామని అన్నారు. అదే విధంగా 2000 సంవత్సరంలో పెరిగిన సాఫ్ట్‌వేర్ రంగం మరింత ముందుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించే ఒక్క ఉత్పత్తి, సేవను కూడా అందించలేదు. అంటే, భారతీయ టిక్‌టాక్, డీప్‌సీక్, చాట్‌జీపీటీ, ఫోర్ట్‌నైట్ ఎక్కడా కనిపించదేం అని రాజన్ ప్రశ్నించారు. వీటిలో కొన్నింటికైనా దేశీయ వెర్షన్‌లు ఉన్నాయి. కానీ అవన్నీ అనుకరణ కిందకే వస్తాయి, మనకంటూ సొంత బ్రాండ్ లేదని పేర్కొన్నారు.

Next Story