EPF: ఒక్క క్లిక్‌తో ఈపీఎఫ్ సొమ్ము వివరాలు తెలుసుకోండి!

by S Gopi |

ఉద్యోగం ముగిసిన తర్వాత లేదా పదవీ విరమణ సమయంలో ఈ మొత్తం ఉద్యోగికి ఒకేసారి అందుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ మొత్తంపై వార్షికంగా 8.25 శాతం వడ్డీ లభిస్తోంది.

EPF: ఒక్క క్లిక్‌తో ఈపీఎఫ్ సొమ్ము వివరాలు తెలుసుకోండి!
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగ జీవితంలో జీతం ఎంత ముఖ్యమో, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందుకే ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తున్న ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకం కోట్లాది మంది ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు సాధనంగా మారింది. ఉద్యోగి, యజమాని ఇద్దరూ చేసే నెలవారీ కంట్రిబ్యూషన్‌లతో ఈ నిధి ఏర్పడుతుంది. ఉద్యోగం ముగిసిన తర్వాత లేదా పదవీ విరమణ సమయంలో ఈ మొత్తం ఉద్యోగికి ఒకేసారి అందుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ మొత్తంపై వార్షికంగా 8.25 శాతం వడ్డీ లభిస్తోంది.

పీఎఫ్ గురించి

ఉద్యోగి ప్రతి నెల తన బేసిక్ జీతం నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్‌గా జమ చేస్తాడు. యజమాని కూడా దానికి సమానమైన మొత్తాన్ని జత చేసి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తుంది. ఈ నిధినే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అంటారు. ఈ సొమ్ముపై ప్రభుత్వం ఏటా ఆకర్షణీయమైన వడ్డీని అందించడమే కాకుండా, పదవీ విరమణ లేదా అత్యవసర సమయాల్లో ఉద్యోగికి ఇది ఒక ఆర్థిక అండగా నిలుస్తుంది.

ఎవరు అర్హులు?

ప్రస్తుతం మూల వేతనం (బేసిక్ పే), కరువు భత్యం (డీఏ) కలిపి నెలకు రూ.15,000 వరకు ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారు. అయితే అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు కూడా స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) ద్వారా అదనపు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా కూడా ఈపీఎఫ్‌కు వర్తించే వడ్డీ ప్రయోజనం లభిస్తుంది.

ఉద్యోగుల అకౌంట్లో పడిన వడ్డీ సొమ్ము వివరాలు తెలుసుకునేందుకు యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు (యూఏఎన్) యాక్టివ్​లో ఉండాలి. ఇది యాక్టివ్​లో ఉన్నవారు ఈపీఎఫ్‌ఓ మెంబర్‌ పోర్టల్‌తోపాటు ఉమాంగ్‌ యాప్‌, ఎస్సెమ్మెస్ సర్వీస్‌ ద్వారా బ్యాలెన్స్​ వివరాలు తెలుసుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ డబ్బులకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము జమ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం అకౌంట్లలో వడ్డీ జమ అయినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. జులై 15 నాటికి అందరి ఖాతాల్లో సొమ్ము క్రెడిట్ అవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో, పీఎఫ్ అకౌంట్​లో వడ్డీ సొమ్ము జమ అయిన విషయాన్ని తెలుసుకునేందుకు ఉన్న మార్గాలను తెలుసుకుందాం..!

ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లు తమ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మూడు మార్గాల్లో ఈ వివరాలు తెలుసుకోవచ్చు.

ఎస్సెమ్మెస్ ద్వారా

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఈపీఎఫ్ఓహెచ్ఓ యూఏఎన్ అని ఎస్సెమ్మెస్ పంపితే లేటెస్ట్ ఈపీఎఫ్ బ్యాలెన్స్, కంట్రిబ్యూషన్ వివరాలు వస్తాయి. ఈ సేవలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

ఉమాంగ్ యాప్

గూగుల్‌పే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త్ర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి ఈపీఎఫ్ఓ – ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ యూఏఎన్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తిచేస్తే బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్

ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సర్వీసెస్, ఫర్ ఎంప్లాయిస్, నో యువర్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా నమోదు చేసి లాగిన్ అయితే డాష్‌బోర్డ్‌లో బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు చూడవచ్చు.

పాత ఈపీఎఫ్ ఖాతాలకు కొత్త దారి

చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడు పాత ఈపీఎఫ్ ఖాతాలను మరిచిపోతుంటారు. కొన్ని ఖాతాలు ఇన్-ఆపరేటివ్‌గా కూడా మారిపోతాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈపీఎఫ్ఓ త్వరలో 'ఇ-ప్రాప్తి' పేరుతో కొత్త పోర్టల్‌ను తీసుకురానుంది. ఈ పోర్టల్ ద్వారా పాత లేదా ఇన్-ఆపరేటివ్ ఖాతాలను సులభంగా గుర్తించి తిరిగి యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.

యూఏఎన్ లేకపోయినా ఉపయోగపడే వ్యవస్థ

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించిన ఈ వ్యవస్థ ప్రారంభ దశలో సభ్యుల ఐడీ ఆధారంగా పనిచేస్తుంది. తర్వాతి దశల్లో యూఏన్ లేదా పాత సభ్యత్వ వివరాలు గుర్తులేని వారికి కూడా ఆధార్ ద్వారా సేవలు అందించేలా దీన్ని విస్తరించే ప్రణాళిక ఉందన్నారు. దీంతో మానవ ప్రమేయం తగ్గడంతో పాటు, పత్రాల ప్రక్రియ సులభమవుతుంది. అలాగే పారదర్శకత, సేవల వేగం కూడా పెరుగుతాయని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.

Next Story