బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

by Yella Dhawani Reddy |

బంగారం అంటే ఇష్టపడని వారుండరు.

బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: బంగారం అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు తమ అలంకరణలో బంగారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే, సాధారణంగా బంగారాన్ని అలంకరణగానే కాదు పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. అందుకే ఎవరైన బంగారం కొనుగోలు ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

బంగారం నాణ్యత

బంగారం కొనే ముందుగా దాని నాణ్యత గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా బంగారం నాణ్యత 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే అది 99.99 శాతం స్వచ్ఛమైదని అర్థం. అయితే ఇది సున్నితంగా ఉండటం వల్ల ఆభరణాలు తయారు చేయలేరు. అందుకే గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లుగా మారుతుంది.

ఇక 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం ఇతర లోహాలు కలిసి ఉంటాయి. అలాగే 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహాలు 25 శాతం ఉంటాయి. 14 క్యారెట్లలో 58.5 శాతం స్వచ్ఛమైన బంగారం మిలిగిన శాతం ఇతర లోహాలు ఉంటాయి. అలాగే, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. అలాగే, బంగారానికి కలిపే ఇతర లోహాన్ని బట్టి బంగారం రంగు మారుతుంది.

బంగారం ధర

బంగారం ధర ఎప్పుడు స్థిరంగా ఉండదు. రోజురోజుకూ మారుతుంటుంది. కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. అలాగే ఒక్కో రాష్ట్రంలో బంగారం ధర ఒక్కోలా ఉంటుంది. దీనికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. దాని ఆధారంగా బంగారం ధర నిర్ణయించబడుతుంది. ఇక అన్ని జువెల్లరీల్లో బంగారం ధరలు ఒకేలా ఉండవు. ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇవి బంగారు నగల్ని వేర్వేరు చోట్ల కొనుగోలు చేస్తుంటాయి. ఇంకా రిఫైనింగ్, ట్రాన్స్‌పొర్టేషన్ వంటి ఛార్జీలు ఉంటాయి. ఇంకా బంగారం స్వచ్ఛతను బట్టి రేట్లు వేర్వేరుగా ఉంటాయి. తరుగు, మేకింగ్ ఛార్జీలు, GST వంటివి అదనంగా ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు ఎలా ఉన్నాయని ఒకట్రెండు షాపుల్లో కనుక్కోవటం మంచిది. అలాగే, అధికారిక వెబ్ సైట్లలో చెక్ చేసుకోవాలి.

హాల్ మార్కింగ్

హాల్‌మార్క్ గుర్తు బంగారు ఆభరణాల నాణ్యతను తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. కోనుగోలు చేసిన బంగారు ఆభరణం BIS హాల్ మార్క్‌ను కలిగి కంటే స్వచ్చమైందని అర్థం. అయితే, కొంతమంది BIS నుంచి లైసెన్సు పొందిన AHC(ఎస్సేయింగ్‌ హాల్‌మార్కింగ్‌ కేంద్రం) నుంచి కాకుండా సొంతంగా హాల్‌మార్కింగ్‌ను ముద్రించి బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కొనుగోలుదారులకు కూడా హాల్‌మార్కింగ్‌ గురించి అవగాహన ఉండాలి. బంగారం ఆభరణాలపై సరైన BIS మార్క్ AHC గుర్తు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు హాల్ మార్క్ విషయంలో సందేహాలు, ఫిర్యాదులుంటే బీఐఎస్ ను నేరుగా సందప్రదించవచ్చు.

తరుగు, తయారీ ఛార్జీలు

బంగారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు.. వివిధ దశల్లో బంగారాన్ని కాల్చడం, కరిగించడం, సుత్తితో కొట్టడం, మిషన్లపై తీగలుగా మార్చడం, డిజైన్లు తీయడం, మెరుగు పెట్టడం ఇలా చేసే ప్రక్రియలో స్వల్ప మెతాదులో బంగారం వృథా అవుతుంది. దీనినే తరుగు లేదా వేస్టెజ్ అంటారు. ఇక దుకాణాదారులు, ఆభరణాల డిజైన్ ఆధారంగా తయారీ ఛార్జీలు ఉంటాయి. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వరకు మేకింగ్ ఛార్జీలు విధిస్తారు. ఇది కొంత తయారీ రుసుము గాను, కొంత తరుగు రూపంలోను వసూలు చేస్తారు.

మోసపోయే అవకాశం ఎక్కడంటే?

స్వర్ణకారుడు తయారు చేసినా, నేరుగా దుకాణాల్లో కొన్నా 10 గ్రాములకు 400 మిల్లీ గ్రాములు తరుగు, మజూరీకి పోతుంది. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలోనే ఉంటుంది. కొంతమంది విక్రయదారులు ఆభరణంలో అద్దిన రాళ్ల బరువును సైతం బంగారంగా చూపిస్తారు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించకపోతే మోసం తప్పదు.

బంగారాన్ని ఇంట్లో ఎలా పరీక్షించాలంటే?

కొనే బంగారు ఆభరణం స్వచ్ఛత, నాణ్యతను కొనుగోలుదారులు పరీక్షించవచ్చు. ఆభరణాల తయారీలో రాగి, జింక్, వెండి కాకుండా బరువు ఎక్కువగా తూగడం కోసం ఇనుమును కూడా కలుపుతారు. అందుకే అయస్కాంతంతో ఆభరాణాన్ని పరీక్షించవచ్చు. ఇనుము ఉంటే ఆభరణం అయస్కాంతానికి అతుక్కుంటుంది. అలాగే ఆభరణాన్ని గీస్తే నల్లటి రంగు కనిపిస్తే అది స్వచ్ఛమైనది కాదని, పసుపు వర్ణం కనిపిస్తే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం. అవకాశముంటే కొనే ఆభరణాన్ని యాసిడ్‌తోనూ పరీక్షించవచ్చు. నైట్రిక్ యాసిడ్ ఒక డ్రాప్ వేస్తే బంగారం రంగు మారితే అది నకిలీదని, రంగు మారకపోతే అది నాణ్యమైనదని తెలుసుకోవచ్చు.

ఇక, బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, తయారీ ధర, తరగు, హాల్ మార్క్ ఛార్జీలు వర్తిస్తాయి. కానీ తిరిగి విక్రయిస్తే ఇవేవి రావు. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువల్ల రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలు కోనుగోలు చేయటం మంచిది.

Next Story