Gold Loans: మే నాటికి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల రుణాల విలువ రూ.2.5 లక్షల కోట్లు

by S Gopi |

బంగారంపై రుణాలు తీసుకునేందుకు వీలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనేక చర్యలు తీసుకుంది

Gold Loans: మే నాటికి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల రుణాల విలువ రూ.2.5 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మే నాటికి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల రుణాల విలువ రూ.2.5 లక్షల కోట్లు దాటిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 115.25 శాతం పెరిగింది. సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. బంగారు ఆభరాణాలపై బ్యాంకు రుణాల విలువ 2024, మేలో రూ. 1,16,777 కోట్ల నుంచి 2025, మేలో రూ. 2,51,369 కోట్లకు పెరిగాయి. ఈ వృద్ధి ప్రధానంగా లోన్-టూ-వాల్యూ(ఎల్‌టీవీ) నిష్పత్తిని పెంచడం, పాలసీ నిర్ణయాలు, రుణగ్రహీతలు బంగారు రుణాలు తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల కారణంగా వచ్చిందని మంత్రి వివరించారు. బంగారంపై రుణాలు తీసుకునేందుకు వీలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా తక్కువ మొత్తం విలువైన రుణాలు అవసరమయ్యే చిన్న రుణగ్రహీతలకు, బంగారు పూచీకత్తుపై రూ.2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్‌-టు-వాల్యూ 75 శాతం నుంచి 85 శాతానికి సవరించింది. అయితే రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు మునుపటి 75 శాతం పరిమితి అలాగే ఉందని మంత్రి చెప్పారు. దేశంలో బంగారం వినియోగ వస్తువుగా మాత్రమే కాకుండా పెట్టుబడి మార్గంగా కూడా ఉందని మంత్రి పేర్కొన్నారు. బంగారం ధర పెరుగుదల వినియోగాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని, ఎందుకంటే ఇప్పటికే ఉన్న బంగారం నిల్వల విలువ పెరుగుతుందని వెల్లడించారు. మరో ప్రశ్నకు సమాధనం చెప్పిన మంత్రి.. ఈ ఏడాది జూన్ 30 నాటికి బ్యాంకులు రూ.67,003 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ నిధికి బదిలీ చేశాయని పేర్కొన్నారు.

Next Story