US-India: వరుసగా నాలుగో ఏడాది భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా

by S Gopi |
US-India: వరుసగా నాలుగో ఏడాది భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా వరుసగా నాలుగో సారి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇటీవలి మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా మధ్య రూ. 11.29 లక్షల కోట్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. అమెరికాకు భారత ఎగుమతులు 11.6 శాతం పెరిగి రూ. 7.41 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతులు కూడా 7.44 శాతం పెరిగాయి. 2024-25లో అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో ప్రధానంగా ఔషధాలు, టెలికాం పరికరాలు, వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, ఇతర విలువైన లోహాలు, పత్తి, స్టీల్, టెక్స్‌టైల్స్, స్టీల్ ఉత్పత్తులు ఉన్నాయి. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే వాటిలో అత్యధికంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, కోక్, కట్ అండ్ పాలిష్ చేసిన వజ్రాలు, విద్యుత్ యంత్రాలు, విమానం, అంతరిక్ష నౌక, ఇతర భాగాలు, బంగారం ఉన్నాయి. ప్రస్తుతం వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున భవిష్యత్తులో భారత్-యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చైనాతో భారత వాణిజ్య లోటు గణనీయంగా 17 శాతం పెరిగి రూ. 8.50 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ గణాంకాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చైనా దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 14.5 శాతంతో రూ. 1.22 లక్షల కోట్లు క్షీణించాయి. దిగుమతులు మాత్రం 11.52 శాతం పెరిగి రూ. 9.81 లక్షల కోట్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో రూ. 8.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ నమోదైంది.

Next Story