Trump Tariff: మారని ట్రంప్ తీరు.. సోలార్ ప్యానెల్స్‌పై 126 శాతం టారిఫ్

by S Gopi |

భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం దిగుమతి సుంకాల్ని విధిస్తున్నట్లు వెల్లడించారు.

Trump Tariff: మారని ట్రంప్ తీరు.. సోలార్ ప్యానెల్స్‌పై 126 శాతం టారిఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవలే ఇండియా-యూఎస్ మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని గురించి ఇరుదేశాలు అధికారిక ప్రకటన కూడా చేశాయి. అయితే, భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మాత్రం మారడంలేదు. తాజాగా మరోసారి భారీ టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం దిగుమతి సుంకాల్ని విధిస్తున్నట్లు వెల్లడించారు. ఫారెన్ సబ్సిడీల ఆధారంగా ఈ స్థాయి రేటు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయంలో భారత్ సోలార్ తయారీ రంగంలో అన్యాయమైన పద్ధతిలో సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల అమెరికా స్థానిక తయారీదారులు నష్టపోతున్నారని అమెరికా వాణిజ్య విభాగం చెబుతోంది. సులభంగా చెప్పాలంటే, భారత్ నుంచి వెళ్లే సోలార్ ప్యానెల్స్ ధరలు, అమెరికాలో కంటే తక్కువగా ఉన్నాయని అర్థం. అందుకే అమెరికా భారత సోలార్ ప్యానెల్స్‌పై భారీ టారిఫ్ విధించింది. మనదేశంతో పాటు మరో రెండు దేశాలపైనా ట్రంప్ టారిఫ్ విధించారు. ఇండోనేసియా సోలార్ ఉత్పత్తులపై 143 శాతం, లావోస్‌పై 81 శాతానికి దిగుమతి సుంకాల్ని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో అమెరికాకు సోలార్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే మన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల బుధవారం స్టాక్ మార్కెట్లలో సోలార్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా వారీ ఎనర్జీస్ 11 శాతం, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, విక్రమ్ సోలార్ లిమిటెడ్ ఒక్కోటి 6 శాతం, సోలెక్స్ ఎనర్జీ లిమిటెడ్ 8 శాతం, వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ 7 శాతం మేర క్షీణించాయి.

Next Story