యూపీఐ కొత్త ఫీచర్.. త్వరలో ఏటీంలలో నగదు డిపాజిట్‌కు అవకాశం

by Dishanational1 |
యూపీఐ కొత్త ఫీచర్.. త్వరలో ఏటీంలలో నగదు డిపాజిట్‌కు అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఎంపీసీ సమావేశ వివరాల వెల్లడి సందర్భంగా కీలక ప్రకటన చేశారు. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్లకు సంబంధించి ప్రతిపాదన ఉంచినట్టు తెలిపారు. మొబైల్‌ఫోన్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేసేందుకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో త్వరలో ప్రముఖ యూపీఐల ద్వారా బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటీఎం మెషీన్‌లలో నగదును డిపాజిట్ చేయాలంటే డెబిట్ కార్డు అవసరం, కొత్త ప్రతిపాదనతో బ్యాంకుల్లో నగదు నిర్వహణ భారాన్ని తగ్గించేలా కస్టమర్లు యూపీఐ నుంచి డిపాజిట్ చేయవచ్చని ఆయన వివరించారు. ఇప్పటికే కార్డు లేకుండా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉన్నందున, దాని ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని డిపాజిట్లకు కూడా ఈ సౌకర్యం విస్తరించడం సులువేనని వెల్లడించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు యూపీఐ నుంచి లావాదేవీలు, బిల్లుల చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు, ఇతర డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. కొత్త మార్పుతో ఏటీఎం కార్డు లేకుండా క్యాష్ డిపాజిట్ మరింత సులభతరం కానుంది.

Next Story

Most Viewed