Debit Cards: తగ్గిపోతున్న డెబిట్ కార్డుల వాడకం.. చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యం

by S Gopi |

ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య వీటి వినియోగం 8 శాతం క్షీణించింది.

Debit Cards: తగ్గిపోతున్న డెబిట్ కార్డుల వాడకం.. చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒకప్పుడు లక్షలాది మందికి చెల్లింపుల విషయంలో కీలకంగా ఉన్న డెబిట్ కార్డులు నెమ్మదిగా వినియోగం నుంచి దూరమవుతున్నాయి. దీని స్థానంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వాడకం అత్యంత వేగంగా జరుగుతోంది. ఒకప్పుడు పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీలకు ప్రాధాన్యత నుంచి ప్రస్తుతం డెబిట్ కార్డులు ఏటీఎం విత్‌డ్రాలకు, అప్పుడప్పుడు స్టోర్‌ కొనుగోళ్లకే పరిమితమవుతున్నాయి. తాజాగా వరల్డ్‌లైన్ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలో 100 కోట్ల కంటే ఎక్కువ డెబిట్ కార్డులు చలామణిలో ఉన్నప్పటికీ, వాటి వాడకం చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య వీటి వినియోగం 8 శాతం క్షీణించింది. చిన్న-మొత్తం చెల్లింపులకు కూడా యూపీఐ ఆధిపత్యం పెరగడమే ఈ మార్పునకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది యూపీఐ లావాదేవీల సగటు రూ. 1,348కి తగ్గింది. 2024లో ప్రథమార్థంలో ఇది రూ. 1,478గా ఉంది. దీనర్థం కిరాణా సామగ్రి, ఇంటి అవసరాలకు, యుటిలిటీ, రోజువారీ ఖర్చులకు డిజిటల్ చెల్లింపులు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూపీఐ సులభంగా అందుబాటులో ఉండటం, పెద్దగా ఖర్చు లేకపోవడం, తక్షణ చెల్లింపులు వంటి అంశాల కారణంగా క్యూఆర్-ఆధారిత లావాదేవీలు పెరుగుతున్నాయని నివేదిక వివరించింది.

2025 ప్రథమార్థంలో మొత్తం 10,640 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇది గతేడాది కంటే 35 శాతం ఎక్కువ. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 143.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీలు సంఖ్యాపరంగా కేవలం 4 శాతం పెరిగి 230 కోట్ల లావాదేవీలకు చేరుకున్నాయి. ఈ వృద్ధిలో ఎక్కువ భాగం క్రెడిట్ కార్డుల వాటా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరిగి 13ల్ కోట్ల లావాదేవీలకు చేరుకోగా, డెబిట్ కార్డుల వినియోగం 24 శాతం తగ్గి 51.6 కోట్లకు చేరుకున్నాయి.

Next Story