RBI: యూపీఐ ఎప్పటికీ ఫ్రీగా ఉండకపోవచ్చు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

by S Gopi |

ఈ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర లావాదేవీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది.

RBI: యూపీఐ ఎప్పటికీ ఫ్రీగా ఉండకపోవచ్చు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం యూపీఐ లాంటి ఆన్‌లైన్ చెల్లింపులను పూర్తిస్థాయిలో ఉచితంగా చేస్తున్నాం. అయితే ఇకపై డిజిటల్ లావాదేవీలు ఎక్కువకాలం ఫ్రీగా లభించకపోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) కొత్త దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆర్థికంగా ఈ వ్యవస్థను స్థిరంగా కొనసాగాలంటే ఛార్జీల అమలు అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం బీఎఫ్‌ఎస్‌ఐ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం యూపీఐ ఎలాంటి యూజర్ ఛార్జీలు లేకుండా కొనసాగుతోంది. అయితే, ఈ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర లావాదేవీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. చెల్లింపులు, నగదు అనేవి వ్యవస్థకు జీవనాడి లాంటివి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి యూపీఐ విధానంలో చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు విధించడంలేదు. అందుకోసం బ్యాంకులు, ఇతర వాటాదారులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే అదనపు ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ ఖర్చులు క్రమంగా భారంగా మారుతున్నాయి. సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు భారత్ కట్టుబడి ఉంది. కానీ దీర్ఘకాలంలో ఇది స్థిరంగా కొనసాగాలంటే ఖర్చులు చెల్లించక తప్పదు. అందుకు ప్రభుత్వమైనా, ప్రజలైనా ఎవరో ఒకరు భరించాల్సిందే. కాబట్టి ప్రస్తుతం చెల్లింపుల ఖర్చులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎక్కువకాలం కొనసాగకపోతే, ప్రజలే దాన్ని భరించాలి. గడిచిన రెండేళ్ల కాలంలో దేశీయంగా రోజూవారీ లావాదేవీలు 31 కోట్ల నుంచి 60 కోట్లకు రెట్టింపు అయిన నేపథ్యంలోనే ఆర్‌బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జీరో ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేటు) విధానం కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం అంతిమంగా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

ఎఫ్‌టీఏతో అనేక రంగాలకు ప్రయోజనం

ఇదే కార్యక్రమంలో బ్యాంకింగ్ సంస్కరణల గురించి మాట్లాడిన ఆయన.. గతంలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. భవిష్యత్తులోనూ అలాంటి నిర్ణయం వల్ల ఆర్థికపరమైన ఫలితాలను ఇస్తాయంటేనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే, గురువారం ఖరారైన భారత్-యూకే చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇలాంటి ఒప్పందాల వల్ల ఆర్థికవ్యవస్థలోని అనేక రంగాలకు ప్రయోజనాలుంటాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య కొరవడుతున్న సంబంధాల మధ్య భారత్ చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు ఎంతో మేలు చేస్తాయన్నారు.

Next Story