Union Budget 2025-26: బడ్జెట్‌కు ముందే మనం తెలుసుకోవాల్సిన కీలక అంశాలివే

by Yella Dhawani Reddy |

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2025-26) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Union Budget 2025-26: బడ్జెట్‌కు ముందే మనం తెలుసుకోవాల్సిన కీలక అంశాలివే
X

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2025-26) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో కేంద్ర మంత్రిగా నిర్మలమ్మ 8వ బడ్జెట్ ప్రసంగం అవుతుంది. సంప్రదాయం ప్రకారం ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం నార్త్ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో బడ్జెట్ ప్రింటింగ్ కోసం లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత హల్వా వేడుక కూడా జరిగింది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా కొనసాగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు.. ఆ తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.

తెలుసుకోవాల్సి కీలక అంశాలివే..

* వార్షిక బడ్జెట్: ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు దీనిని రూపొందిస్తారు. ఇందులో ఒక ఏడాదికి సంబంధించిన ఆదాయం, వ్యయాల పూర్తి ప్రణాళిక ఉంటుంది. ఇక రాష్ట్ర బడ్జెట్‌ అయితే అసెంబ్లీలో, కేంద్ర బడ్జెట్‌ అయితే పార్లమెంటులో ప్రవేశపెడతారు.

* బడ్జెట్ అంచనా: మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగాలు, ప్రభుత్వ పథకాలకు కేటాయించాల్సిన నిధుల అంచనాను రూపొందిస్తారు. ఇది డబ్బులు ఎక్కడు, ఎలా, ఎంత ఖర్చు చేయాలనేది తెలియజేస్తుంది.

* మూలధన వ్యయం: యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్య మొదలైన వాటి అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చించే డబ్బునే మూలధన వ్యయం అంటారు. ఇది, భవిష్యత్తులో లాభాలు లేదా డివిడెండ్‌ను ఇచ్చే ప్రభుత్వ భూమి, పెట్టుబడి వంటి స్థిరాస్తులను సంపాదించడానికి చేసే ఖర్చు కూడా ఇందులో భాగమే.

* ఆర్థిక బిల్లు: కొత్త పన్నులు విధించడం, పన్ను నిర్మాణాన్ని మార్చడం లేదా ఇప్పటికే ఉన్న పన్నులను కొనసాగించడం లాంటివి ప్రవేశపెడతారు.

* ద్రవ్య లోటు: గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మొత్తం వ్యయం, రాబడుల మధ్య వ్యత్యాసం ఉంటే దాన్ని 'ఫిస్కల్ డెఫిసిట్' అంటారు. ఈ వ్యత్యాసాన్ని ఇతర చర్యలతో పాటు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి రుణం తీసుకోవడం ద్వారా పూరించబడుతుంది. దీన్ని GDPగా లెక్కిస్తారు.

* పరోక్ష పన్నులు: మార్కెట్లో ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే పన్నునే పరోక్ష పన్నులుగా (Indirect Tax) పేర్కొంటారు.

* ద్రవ్యోల్బణం: ఇది దేశంలోని వస్తువులు, సేవలు, వస్తువుల సాధారణ ధరల పెరుగుదలను సూచిస్తుంది.

* కొత్త పన్ను విధానం: 2022లో ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానంలో 7 పన్ను స్లాబ్‌లు రాయితీ రేట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది డిఫాల్ట్ పాలనగా మారింది. ఇక పాత పన్ను విధానం ఒక ఎంపికగా మారిపోయింది.

* పాత పన్ను విధానం: పాత పన్ను విధానంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి 30 శాతం అత్యధిక పన్ను రేటుతో కేవలం 4 స్లాబ్‌లు మాత్రమే ఉన్నాయి.

* పన్ను మినహాయింపు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 80D కింద రూ.25 వేల నుంచి రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. PPF, NSC, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.

* మిగులు బడ్జెట్‌: ప్రభుత్వ ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే.. దాన్ని మిగులు బడ్జెట్ అంటారు.

* రాయితీలు: నిర్దిష్ట రంగాలకు లేదా వ్యక్తులకు ప్రభుత్వాలు ప్రోత్సహించడం కోసం ఇచ్చే డబ్బునే రాయితీ అంటారు. ఈ రాయితీలు సాధారణంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్య రంగాలకు అందజేస్తుంటారు.

* అప్పులు: వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వాలు ఇతరులకు చెల్లించాల్సిన మొత్తాలే అప్పులు అంటారు. ఈ అప్పులను దీర్ఘకాల అప్పులు, తాత్కాలిక లేదా స్వల్పకాల అప్పులుగా విభజించారు.

* ఆర్థిక విధానం: ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చులను నియంత్రించే విధానమే ఈ ఆర్థిక విధానం. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్థిక విధానం ఎంతగానో తోడ్పుతుంది.

ఇక, 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్నులో ఎలాంటి మినహాయింపులు ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. బీమాపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. బీమాపై పన్ను మినహాయింపు పెంచితే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

Next Story