Retail Loans: రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

by S Gopi |   (  Updated:2025-12-23 17:36:52  IST  )

రుణాలను బట్టి 30 బేసిస్ పాయింట్లు మొదలుకొని 160 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించినట్టు బ్యాంకు తెలిపింది.

Retail Loans: రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. వివిధ రుణాలను బట్టి 30 బేసిస్ పాయింట్లు మొదలుకొని 160 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించినట్టు బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది. సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 18 నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 30 బేసిస్ పాయింట్లు తగ్గాయని, దీనివల్ల గతంలో ఇళ్ల రుణాలపై వడ్డీ 7.45 శాతం వర్తించగా, ఇప్పుడిది 7.15 శాతానికి చేరిందని బ్యాంకు వివరించింది. వాహన రుణాలపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈ రుణాలు 7.50 శాతం నుంచి, వ్యక్తిగత రుణాలపై అత్యధికంగా 160 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇవి 8.75 శాతం నుంచి లోన్లు మొదలవుతాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు అర్హత కలిగిన గ్రీన్ ఫైనాన్స్ కింద ఇళ్ల, వాహన రుణాలపై అదనంగా 0.10 శాతం రాయితీ ఇస్తున్నట్టు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నెల ప్రారంభంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే వివిధ బ్యాంకు రిటైల్ రుణాలపై వడ్డీని తగ్గిస్తున్నాయి.

Next Story