- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UAE: యూఏఈ సంచలన నిర్ణయం
చమురు ఉత్పత్తి కోటాలపై నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఈ నిర్ణయానికి దారి తీసినట్టు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్‌తో పాటు ఒపెక్ ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. చమురు ఉత్పత్తి కోటాలపై నెలలుగా కొనసాగుతున్న అసంతృప్తి ఈ నిర్ణయానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం వెనుక సౌదీ అరేబియాతో కొనసాగుతున్న ఉత్పత్తి నియంత్రణ తగాదాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎవరు ఎంత ఆయిల్ ఉత్పత్తి చేయాలి అనే అంశమే రెండు దేశాల మధ్య ప్రధాన విభేదంగా మారింది. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే వేడెక్కిన గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌పై ఈ నిర్ణయం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
యూఏఈ నిర్ణయం చమురు ఎగుమతి చేసే దేశాల కూటమితో పాటు, సౌదీ అరేబియాకు అతిపెద్ద దెబ్బ అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కూటమిలో దీర్ఘకాల సభ్యదేశంగా ఉన్న యూఏఈ నిష్క్రమణ, కూటమిలోని సమైక్యతను బలహీనపరిచి, ఉత్పత్తి వ్యూహాలు, ప్రపంచ చమురు సరఫరాపై కొత్త అనిశ్చితిని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై యూఏఈ ఇంధన మంత్రి సుహైల్ మొహమ్మద్ అల్-మజ్రూయీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పూర్తిగా దేశ దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో భాగంగా తీసుకున్నాం. అయితే, ఈ నిర్ణయానికి ముందు యూఏఈ, సౌదీ అరేబియాతో సహా మరే ఇతర దేశాన్ని సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
మార్కెట్ వర్గాల ప్రకారం, ఒపెక్ ప్లస్ నుంచి కీలక సభ్య దేశం బయటకు రావడం వల్ల గ్లోబల్ ఆయిల్ సరఫరాను తీవ్ర ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికే యుద్ధాల కారణంగా ఒత్తిడిలో ఉన్న మార్కెట్‌కు ఇది కొత్త అనిశ్చితిని సృష్టించనుంది. కాగా, యూఏఈ దశాబ్దాలుగా ఒపెక్‌తో అనుబంధం కొనసాగిస్తోంది. తొలిసారిగా 1967లో ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోగా, సౌదీ, ఇరాక్ తర్వాత అతిపెద్ద చమురు ఎగుమతి దేశంగా ఉంది. ఇలాంటి సమయంలో యూఏఈ వైదొలగడం ఈ కూటమి చరిత్రలో కీలకమైన మార్పు కానుంది.






