TV Prices: జనవరి నుంచి టీవీ ధరలు పెరిగే ఛాన్స్

by S Gopi |

రూపాయి బలహీనత వల్ల జనవరి నుంచి టెలివిజన్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు.

TV Prices: జనవరి నుంచి టీవీ ధరలు పెరిగే ఛాన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో టీవీల ధరలు పెరగనున్నాయి. తయారీ కంపెనీలకు మెమొరీ చిప్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు ఉండనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే మొదటిసారిగా రూ. 90కి చేరింది. రూపాయి బలహీనత వల్ల జనవరి నుంచి టెలివిజన్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఫలితంగా ఎల్ఈడీ, స్మార్ట్‌టీల ధరలు 3-10 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ పెంపు నిజమైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు మసకబారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశీయంగా ఎల్ఈడీ టీవీల్లో 30 శాతం మాత్రమే స్థానిక విడిభాగాలతో తయారవుతున్నాయి. మిగిలిన 70 శాతం దిగుమతులు అవుతున్నాయి. ఇందులో ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్‌బోర్డు వంటి కీలక విడిభాగాలు విదేశాల నుంచి వస్తున్నాయి. దీనివల్ల కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు ఏర్పడితే టీవీ తయారీ కంపెనీలకు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అత్యవసరంగా కంపెనీలు ఎదుర్కొనే సమస్యల్లో మెమొరీ చిప్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అంతర్జాతీయంగా కొరత ఏర్పడటం, అధిక లాభాలు వస్తున్నాయని చిప్ తయారీదారులు ఏఐ ఉత్పత్తుల కోసం చిప్‌లను తయారు చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫలితంగా, టీవీల తయారీకి కావాల్సిన చిప్‌ల లభ్యత తగ్గింది. టీవీల తయారీలో చిప్‌ల డిమాండ్ కారణంగా వాటి ధరలు అధికంగా ఉన్నాయి.

Next Story