Economy: ట్రంప్ సుంకాల పెంపుతో దేశ జీడీపీ 0.8 శాతం తగ్గే అవకాశం

by S Gopi |   (  Updated:2025-08-07 11:29:19  IST  )

అమెరికా సుంకాలను పూర్తిగా అమలు చేస్తే వాస్తవ జీడీపీ వృద్ధిలో 0.3 శాతం క్షీణతకు అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా

Economy: ట్రంప్ సుంకాల పెంపుతో దేశ జీడీపీ 0.8 శాతం తగ్గే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాల తొలి దశ గురువారం ప్రారంభమైంది. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం ఎగుమతులను దెబ్బతీయనున్న నేపథ్యంలో, అమెరికాకు భారత్ చేసే 87 బిలియన్ డాలర్ల(రూ. 7.6 లక్షల కోట్ల) భారీ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఫలితంగా దేశ జీడీపీ వృద్ధిని 80 బేసిస్ పాయింట్ల వరకు దెబ్బ తీయవచ్చని దిగ్గజ బ్రోకరేజీలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా సుంకాలను పూర్తిగా అమలు చేస్తే వాస్తవ జీడీపీ వృద్ధిలో 0.3 శాతం క్షీణతకు అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. మరో బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత్ అమెరికాకు చేసే ఎగుమతుల్లో 67 శాతం వస్తువులపై 50 శాతం సుంకం వర్తిస్తుంది. దీనర్థం 58 బిలియన్ డాలర్లు(రూ. 5 లక్షల కోట్లు, జీడీపీలో 1.5 శాతం) తక్షణ ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రస్తుతానికి అమెరికాకు వెళ్లే దాదాపు 30 శాతం ఉన్న ఔషధ, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు మాత్రమే మినహాయింపు ఉంది. అన్ని వస్తువుల ఎగుమతులు 50 శాతం సుంకం పరిధిలోకి వస్తే వృద్ధిపై ప్రత్యక్షంగా 60 బేసిస్ పాయింట్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది. పరోక్ష ప్రభావం వచ్చే 12 నెలల వ్యవధిలో ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తద్వారా మొత్తంగా 80 బేసిస్ పాయింట్లు(0.8 శాతం) ప్రభావం ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అమెరికా టారిఫ్ ప్రభావం శాశ్వతంగా ఉండని, ట్రంప్ వ్యూహత్మకంగా చర్చల కోసం ప్రయత్నిస్తున్నారని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. అమెరికా ఆర్థికవ్యవస్థ ప్రయోజనాల కోసమే సాధ్యమైనంత అనుకూల ఒప్పందం రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అంతిమంగా, రెండు దేశాల ప్రయోజనాలను కాపాడుతూ సరైన పరిష్కారాన్ని ఆశించాలని పేర్కొంది.

Next Story