Apple: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్

by S Gopi |   (  Updated:2025-05-15 09:33:23  IST  )

భారత్‌లో వేగంగా జరుగుతున్న ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టడం నాకు ఇష్టం లేదని చెప్పాను.

Apple: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కీలకమైన భారత్, పాక్ విషయంలో అనవసర జోక్యం, మధ్యవర్తిత్వం చేస్తానని ఇటీవల మాట్లాడిన ట్రంప్, తాజాగా భారత్‌లో యాపిల్ తయారీ విస్తరణ ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళిక పట్ల అయిష్టతను కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌తోనే చెప్పానని, భారత్‌లో ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కూడా అడిగానని ట్రంప్ అన్నారు. ఖతార్ పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓతో మాట్లాడాను. భారత్‌లో వేగంగా జరుగుతున్న ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఈ విషయంలో అమెరికాకు ఎలాంటి ఆసక్తి లేదు. భారత్ సంగతి ఆ దేశం చూసుకోగలదని చెప్పాను. అమెరికాలో ఉత్పత్తిని పెంచాలని చెప్పాను. భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటి. అత్యధిక జనాభా కలిగిన దేశంలో అమెరికన్ ఉత్పత్తులను అమ్మడం చాలా కష్టం. అయితే, దిగుమతి పన్నులపై ఒప్పంద ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గిస్తామని భారత్ చెప్పిందని ఆయన అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి అమెరికా తన ఐఫోన్ సరఫరాలో ఎక్కువ భాగం భారత్ నుంచే చేయాలని భావిస్తున్న యాపిల్ ప్రణాళికలను ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story