- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: ట్రంప్ టారిఫ్ విరామంతో స్టాక్ మార్కెట్లలో ర్యాలీ
90 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటన మన మార్కెట్లకు కలిసొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల విషయంలో వెనకడుగు వేయడం నేపథ్యంలో శుక్రవారం సూచీలు భారీగా ర్యాలీ చేశాయి. అంతకుముందు రోజే ట్రంప్ ప్రకటన వెలువడినప్పటికీ, మన మార్కెట్లకు సెలవు కావడంతో ఒకరోజు ఆలస్యంగా మార్కెట్లలో రియాక్షన్ కనిపించింది. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదరడం, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం మధ్య 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటన మన మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో పాటు అమెరికా కరెన్సీ డాలర్ విలువ క్షీణించడం, గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు మరింత క్షీణించడం వంటి పరిణామాలు లాభాలకు కారణమయ్యాయి. ఈ క్రమంలో దేశీయంగా కీలక ఫార్మా, మెటల్ రంగాలు రాణించడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,310.11 పాయింట్లు ఎగసి 75,157 వద్ద, నిఫ్టీ 429.40 పాయింట్లు లాభపడి 22,828 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.12 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో వారాంతం రోజున మదుపర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ మార్కెట్ రూ.402 లక్షల కోట్లకు చేరుకుంది.






