Economy: ట్రంప్ సుంకాల వల్ల దేశ జీడీపీ 0.5 శాతం తగ్గుతుంది

by S Gopi |

ట్రంప్ టారిఫ్ ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి, జీడీపీ 0.5 శాతం నుంచి 0.6 శాతం మధ్య ప్రభావితం అవుతుంది.

Economy: ట్రంప్ సుంకాల వల్ల దేశ జీడీపీ 0.5 శాతం తగ్గుతుంది
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ప్రభుత్వం భారత్‌పై విధించిన అధిక 50 శాతం టారిఫ్ కారణంగా మనదేశ జీడీపీ ప్రభావితం అవుతుంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 0.5 శాతం మేర క్షీణత తప్పదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. సోమవారం బ్లూమ్‌బర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ట్రంప్ టారిఫ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి, జీడీపీ 0.5 శాతం నుంచి 0.6 శాతం మధ్య ప్రభావితం అవుతుంది. అదనపు సుంకాలు కొంతకాలం ఉంటుందని భావిస్తున్నాను. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇవి కొనసాగితే ప్రభావం మరింత పెరుగుతుంది. ఫలితంగా మన ఆర్థికవ్యవస్థ వృద్ధి వేగాన్ని దెబ్బతీస్తుందని నాగేశ్వరన్ హెచ్చరించారు. ట్రంప్ టారిఫ్ వంటి ప్రతికూలత ఉన్నప్పటికీ, ప్రభుత్వం 2025-26లో భారత వృద్ధి అంచనా 6.3 శాతం నుంచి 6.8 శాతం సాధించగలదు. ఇందుకు తొలి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం వృద్ధి నిదర్శనం. తాజాగా కేంద్రం తీసుకున్న జీఎస్టీ సంస్కరణలతో వ్యవస్థలో గిరాకీ పుంజుకుంటుందనే భావిస్తున్నాను. జీఎస్టీ శ్లాబులను తగ్గించడం మూలంగా పెరిగే డిమాండ్ దేశ జీడీపీకి 0.2 శాతం నుంచి 0.3 శాతం మేర సహకరిస్తుందని పేర్కొన్నారు.

Next Story