Housing Market: జనవరి-మార్చిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు

by S Gopi |

హైదరాబాద్, పూణే వంటి ప్రధాన నగరాలు కూడా ధరలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి.

Housing Market: జనవరి-మార్చిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 3-24 శాతం వరకు పెరిగాయి. ఇందులో బెంగళూరు అత్యధికంగా 24 శాతం వృద్ధితో ముందంజలో నిలిచింది. ప్రస్తుతం అక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.9,785కి చేరుకుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరలు 20 శాతం పెరిగి రూ.15,120కు చేరగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 18 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,534 నమోదయ్యాయి. హైదరాబాద్, పూణే వంటి ప్రధాన నగరాలు కూడా ధరలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్‌లో 11 శాతం పెరగడంతో చదరపు అడుగు సగటున రూ. 8,200కి చేరుకుంది. పూణేలో 12 శాతం, అహ్మదాబాద్‌లో 8 శాతం, కోల్‌కతాలో 7 శాతం, చెన్నైలో మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. ప్రాప్‌టైగర్ సీఈఓ ప్రకాష్ తేజ్వానీ ప్రకారం, భారత హౌసింగ్ మార్కెట్ ఇప్పుడు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే అంచనాతో లాభాల కోసం మాత్రమే కొనుగోలు చేసే దశ నుంచి వాస్తవ డిమాండ్ ఆధారిత వృద్ధి దశలోకి ప్రవేశించింది. కొనుగోలుదారుల విశ్వాసం, ప్రీమియం గృహాలపై పెరుగుతున్న ఆసక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Next Story