TikTok: మళ్లీ అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్.. ప్రభుత్వం స్పష్టత

by S Gopi |

కొంతమంది యూజర్లు ఇటీవల కొన్ని చైనా ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

TikTok: మళ్లీ అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్.. ప్రభుత్వం స్పష్టత
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం గతంలో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఐదేళ్ల తర్వాత వీటిలో టిక్‌టాక్, అలీ ఎక్స్‌ప్రెస్ వంటి ప్లాట్‌ఫామ్‌లు తిరిగి అందుబాటులోకి రావడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొంతమంది యూజర్లు ఇటీవల కొన్ని చైనా ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, వాటి వెబ్‌సైట్‌లు పనిచేస్తున్నప్పటికీ యాప్స్ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో లేవని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ వర్గాలను సంప్రదించగా, 2020లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద తొలగించిన వాటిని కేంద్రం అన్‌బ్లాక్ చేయలేదని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. డేటా భద్రత, గోప్యత విషయంలో ఆందోళనలను పేర్కొంటూ టిక్‌టాక్, అలీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు అనేక ఇతర చైనీస్ యాప్‌లను 2020, జూన్‌లో భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లు భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు, దేశ రక్షణ, భద్రత విషయంలో పక్షపాతం చూపుతున్నాయని పేర్కొంది. అంతేకాకుండా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

Next Story