Credit Cards: క్రెడిట్ కార్డులపై విధించే ఈ ఛార్జీల గురించి తెలుసుకున్నారా!

by S Gopi |

అయితే, క్రెడిట్ కార్డు వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, దానికి తగినట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయని మరవకూడదు.

Credit Cards: క్రెడిట్ కార్డులపై విధించే ఈ ఛార్జీల గురించి తెలుసుకున్నారా!
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనం డిజిటల్ లావాదేవీలవైపు అడుగులు వేస్తున్న కొద్దీ, క్రెడిట్ కార్డులు మన ఆర్థిక జీవితాల్లో భాగమైపోయాయి. క్రెడిట్ కార్డులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు, చెల్లింపులు సులభంగా చేయడానికి వీలును కల్పిస్తాయి. క్రెడిట్ కార్డ్‌తో సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్‌లను వాడే పనిలేకుండా నిర్ణీత పరిమితి వరకు ఖర్చు చేసే సదుపాయం ఉంటుంది. బిల్లు జనరేట్ అయిన తర్వాత తీసుకున్న మొత్తాన్ని కూడా ఈజీగా రీపే చేయవచ్చు. అంతేకాకుందా, కార్డ్ కొనుగోళ్లపై రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. అయితే, క్రెడిట్ కార్డు వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, దానికి తగినట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయని మరవకూడదు. క్రెడిట్ కార్డు ఇచ్చే సంస్థలు వాటిపై కొన్ని సాధారణ ఛార్జీలైన వార్షిక ఫీజులు, ఆలస్య చెల్లింపులపై, విదేశీ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ఇతర ఛార్జీలను కూడా సంస్థలు వసూలు చేస్తాయి. క్రెడిట్ కార్డుల వాడకంలో అలాంటి ఛార్జీల గురించి తెలుసుకోవడం వల్ల మన ఖర్చులను మనం అదుపులో ఉంచుకోవడం, అనవసర ఛార్జీల భారం నుంచి బయటపడొచ్చు. అలాంటి కొన్ని ముఖ్యమైన ఛార్జీల గురించి తెలుసుకుందాం..!

క్రెడిట్ కార్డ్ జారీచేసే సంస్థలు లోన్ రూల్స్ ఆధారంగా వివిధ రకాల ఛార్జీలను విధిస్తాయి. అవి..

జాయినింగ్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ

క్రెడిట్ కార్డ్ ఆమోదం పొందిన తర్వాత సాధారణంగా జాయినింగ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కార్డ్ జారీ సంస్థ యాన్యూవల్ మెయింటెనెన్స్ ఫీజును కూడా విధిస్తుంది. ఈ ఛార్జీలు సంస్థను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కార్డు ఫీచర్స్, ప్రయోజనాలపై కూడా ఆధారపడి ఉంటాయి. ఇది కార్డు ఉపయోగించే ఖర్చులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఈ ఛార్జీలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వార్షిక కార్డు వినియోగం ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని మించి ఉంటే కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డ్ ఛార్జీని మాఫీ చేస్తాయి.

వడ్డీ ఛార్జీలు

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ నెలవారీగా జనరేట్ అవుతుంది. బ్యాంకులు ఫిక్స్‌డ్ తేదీని సెట్ చేస్తాయి. కార్డు ఉన్న వ్యక్తి ఆ తేది లోపు మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ ఛార్జీల భారం వద్దనుకుంటే మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించాలి. ఒకవేళ మొత్తం కార్డు బకాయిల్లోంచి కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తే, మిగిలిన మొత్తంపై వడ్డీ ఛార్జీలను చెల్లించక తప్పదు. వడ్డీ లేదా వార్షిక శాతం రేటు(ఏపీఆర్) కాలవ్యవధిని బట్టి ఇది మారుతుంది. మనదేశంలో క్రెడిట్‌ కార్డు సంస్థలు సాధారణంగా 18-42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. బిల్లుల చెల్లింపును ఎంత ఆలస్యం చేస్తున్నారనే దాన్ని బట్టి వడ్డీ రేటు మారుతుంది.

కార్డ్ రీప్లేస్‌మెంట్ ఫీజు

మన వద్ద ఉన్న క్రెడిట్ కార్డ్ పోయినా, చోరికి గురైనా, గడువు ముగిసినా ఆన్‌లైన్‌లో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం కార్డ్ జారీసే సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కొత్త కార్డు గురించి రిక్వెస్ట్ చేయాలి. ఇందుకు గానూ క్రెడిట్‌ కార్డు సంస్థ కార్డు రీప్లేస్‌మెంట్ ఫీజును వసూలు చేస్తుంది. ఈ ఫీజు దాదాపు రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటుంది. కొన్ని సంస్థలు ఉచితంగా కూడా ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

జీఎస్‌టీ

ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ లావాదేవీలన్నింటికీ జీఎస్టీ రేట్ల ప్రకారం పన్ను అమలవుతుంది. అదనంగా, యాన్యూవల్ మెయింటెనెన్స్ ఫీజు, వడ్డీ, లేట్ పేమెంట్స్, ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజులపై ​​కూడా జీఎస్టీ ఉంటుంది. క్రెడిట్ కార్డు సేవలు, ఛార్జీలపై వర్తించే ఘ్శ్ట్ 18 శాతం వరకు ఉంది. క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే రైల్వే టిక్కెట్ బుకింగ్‌, ఫ్యూయెల్ పేమెంట్స్ సమయంలో అదనంగా సర్‌ఛార్జీ కూడా విధిస్తారు.

ఓవర్‌లిమిట్ ఫీజు

క్రెడిట్ కార్డ్ క్రెడిట్ నిర్దిష్ట పరిమితితో వస్తుంది, అంటే మీరు కార్డుపై ఖర్చు చేయడానికి అనుమతించిన గరిష్ట మొత్తం. ఈ పరిమితిని మించితే, కార్డ్ జారీ చేసిన సంస్థ జరిమానా రూపంలో ఓవర్-లిమిట్ ఫీజును విధిస్తుంది. ఈ ఫీజు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ, క్రెడిట్ కార్డ్ ఒప్పందం నిబంధనల ఆధారంగా మారుతుంది. సాధారణంగా, కనీస ఓవర్-లిమిట్ ఫీజు రూ. 500 లేదా పరిమితి దాటి ఖర్చు చేసిన మొత్తంలో ఒక శాతం ఉంటుంది.

రివార్డ్స్ రిడెంప్షన్ ఫీజు

క్రెడిట్ కార్డును వాడటం వల్ల రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. వీటి ద్వారా కొన్ని ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, గిఫ్ట్ కార్డులు, ట్రావెల్ వోచర్లు లేదా ఏవైనా సరుకుల కొనుగోలు ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లను ఉపయోగించినప్పుడు, కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీలు రివార్డ్ రిడెంప్షన్ ప్రాసెసింగ్ ఫీజును విధిస్తాయి. ఈ ఫీజు ఫ్లాట్ రేటు లేదా రిడెంప్షన్ విలువలో కొంత శాతంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ఈ ఫీజును రిడీమ్ చేసిన రివార్డుల మొత్తం నుంచి తీసేస్తారు. దీనికి సంబంధించిన వివరాలు క్రెడిట్ కార్డ్ ఒప్పందంలోని నిబంధనలు, షరతుల విభాగం కింద ఉంటాయి. కాబట్టి, ఈ ఫీజు గురించి అర్థం చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ ఒప్పందాన్ని వివరంగా తెలుసుకోవడం మంచిది.

డూప్లికేట్ స్టేట్‌మెంట్‌

క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లకు సంబంధించి ప్రింట్ కాపీలను కావాలనుకుంటే, క్రెడిట్‌ కార్డు ఇచ్చిన సంస్థలు ఒక్కో స్టేట్‌మెంట్‌కు దాదాపు రూ.50 నుంచి రూ.200 వరకు ఫీజును విధిస్తాయి.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు

ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డ్ నుంచి మరొక బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు బ్యాలెన్స్‌ను బదిలీ చేసిన సమయంలో, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుది. ఈ ఫీజు సాధారణంగా బదిలీ చేసిన మొత్తంలో 1-3 శాతం మధ్య ఉంటుంది.

Next Story