Tesla: టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటుకు తేదీ ఖరారు

by S Gopi |

ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్‌ కంపెనీ భారత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.

Tesla: టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటుకు తేదీ ఖరారు
X

దిశ, బిజినెస్ బ్యూరో: చాలాకాలంగా భారత మార్కెట్లో ఎంట్రీకి చూస్తున్న గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా ఎట్టకేలకు మొదటి షోరూమ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది 15వ తేదీన టెస్లా తమ తొలి 'ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ' ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ప్రారంభిస్తుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు కీలక అడుగు అని జాతీయ మీడియా పేర్కొంది. ఈ స్టోర్ కోసం టెస్లా కంపెనీ 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా యూరప్, చైనా మార్కెట్లలో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. దీన్ని భర్తీ చేసేందుకు గానూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఉన్న మనదేశం మార్కెట్లోకి అడుగు పెట్టడం ముఖ్యమని టెస్లా భావించింది. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్‌ కంపెనీ భారత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అందుకనుగుణంగా గడిచిన నెలా, రెండు నెలల వ్యవధిలోనే భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేసింది. ముంబైలో తొలి షోరూమ్ ఏర్పాటు అయ్యాక రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలోనూ స్టోర్ ఏర్పాటుకు టెస్లా ప్రయత్నిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ అభిప్రాయపడింది. ఇప్పటికే టెస్లా కంపెనీ చైనా, అమెరికా, నెదర్లాండ్స్ నుంచి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం అవసరమైన సూపర్ ఛార్జర్స్ పరికరాలు, కార్ యాక్సెసరీస్, ఇతర విడిభాగాలను దిగుమతి చేసుకున్నట్టు సమాచారం.

ముంబై షోరూమ్‌తో కలుపుకుని టెస్లా మొత్తం నాలుగు చోట్ల కమర్షియల్ స్థలాలను లీజుకు తీసుకుంది. పూణేలో ఇంజనీరింగ్ హబ్‌తో పాటు బెంగళూరులో రిజిస్టర్‌డ్ ఆఫీస్, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సమీపంలో తాత్కాలిక ఆఫీస్ ఉన్నాయి. కంపెనీకి చెందిన మోడల్‌ వై రేర్‌ వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీ కార్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయని తెలుస్తోంది. మోడల్‌ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ కారు. ప్రస్తుతం ఈ కారు ధర అమెరికాలో 44,990 డాలర్లు ఉండగా, భారత్‌లో దీన్ని 56,000 డాలర్లకు(మన కరెన్సీలో దాదాపు రూ. 49 లక్షలు) ఉండొచ్చని అంచనా

Next Story