Tesla: ఢిల్లీలో రెండో షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా

by S Gopi |

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి వాటి డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది.

Tesla: ఢిల్లీలో రెండో షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈవీ దిగ్గజం టెస్లా సోమవారం భారత మార్కెట్లో తన రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్‌మార్క్ 3 వద్ద దీన్ని ఏర్పాటు చేసింది. జూలైలో ముంబైలోని బాంద్రాలో తొలి షోరూంను ప్రారంభించిన కంపెనీ నెలరోజుల వ్యవధిలోనే ఇప్పుడు రెండో షోరూంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంటుంది. రానున్న రోజుల్లో మరో మూడు షోరూమ్‌ల ఏర్పాటుపైనా కంపెనీ ప్రణాళికలు కలిగి ఉంది. భారత మార్కెట్లోకి తన మోడల్ వై కారును విడుదల చేసిన టెస్లా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి వాటి డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. రెండు వేరియంట్లలో తెచ్చిన ఈ కారులో 500-కిమీ రేంజ్ వేరియంట్‌ను ఏడాది ఆఖరులో, 622-కిమీ రేంజ్ వేరియంట్ చివరి త్రైమాసికంలో కస్టమర్లకు ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది. టెస్లా తన మోడల్ వై కారును మనదేశంలో దాదాపు రూ. 60 లక్షల ధరకు విక్రయిస్తోంది. లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ ధరను రూ. 68 లక్షలుగా నిర్ణయించింది. పూర్తిగా సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్ ఉన్న కారు కావాలంటే కారు ధరకు అదనంగా రూ. 6 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టెస్లా తన కస్టమర్ల కోసం గురుగ్రామ్‌లో సూపర్‌ఛార్జర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముంబైలోని లోయర్ పరేల్, నవీ ముంబై, థానేలలో కొత్త ఛార్జింగ్ స్టేషన్లను తీసుకురానుంది. ముంబై, ఢిల్లీ తర్వాత తమకు బెంగళూరు అతిపెద్ద మార్కెట్ అని టెస్లా ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ ఇసాబెల్ ఫ్యాన్ అన్నారు. మరికొద్దిరోజుల్లో కంపెనీ మొబైల్ సర్వీస్ యూనిట్లు, రిమోట్ డయాగ్నస్టిక్స్, సర్వీస్ సెంటర్ అందుబాటులోకి తెస్తామని ఇసాబెల్ పేర్కొన్నారు.

Next Story