Tesla India: జూలైలో షోరూమ్‌ను ప్రారంభించనున్న టెస్లా

by S Gopi |

ఇప్పటికే టెస్లాకు చెందిన మొదటి సెట్ కార్లు దేశంలోకి వచ్చాయి.

Tesla India: జూలైలో షోరూమ్‌ను ప్రారంభించనున్న టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా ఈ ఏడాది జూలైలో భారత మార్కెట్లో తొలి షోరూమ్‌ను ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లాకు యూరప్, చైనా దేశాల్లో అమ్మకాలు పడిపోతున్నాయి. దీన్ని భర్తీ చేసేందుకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టడం ముఖ్యమని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే టెస్లాకు చెందిన మొదటి సెట్ కార్లు దేశంలోకి వచ్చాయి. 'మోడల్ వై' రియల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలను చైనా ఫ్యాక్టరీ నుంచి రవాణా చేసినట్టు సమాచారం. ఈ 'మోడల్ వై' కారు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ కారు. జూలై మూడో వారానికి ముంబైలోని టెస్లా మొదటి షోరూమ్‌లో ఈ కారును అందుబాటులో ఉంచుతారు. దీని తర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ మరొక షోరూమ్ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ ఈవీ కార్ల కోసం అవసరమైన సూపర్‌ఛార్జర్ విడిభాగాలు, కారు పరికరాలు, వస్తువులు, ఇతర విడిభాగాలను దిగుమతి చేసినట్టు సమాచారం.

బ్లూమ్‌బర్గ్ పరిశీలించినట్టు చెబుతున్న డాక్యుమెంట్ల ప్రకారం, టెస్లా చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి ఐదు 'మోడల్ వై' ఈవీలను ముంబై తరలించింది. ఈ కారు ధర రూ. 27.7 లక్షలు(31,988 డాలర్లు)గా ప్రకటించారు. దిగుమతి సుంకం అదనంగా మరో రూ. 21 లక్షల వరకు ఉండనుంది. అంటే టెస్లా మోడల్ వై కారు పన్నులు, ఇన్సూరెన్స్‌కు ముందు సుమారు రూ. 48.4 లక్షల(56,000 డాలర్లు)కు అమ్మకానికి రావొచ్చని భావిస్తున్నారు. అయితే, మార్కెట్ వర్గాల ప్రకారం.. టెస్లా తన మార్జిన్, పొజిషనింగ్ ఆధారంగా తుది ధరను నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం 'మోడల్ వై' కారు అమెరికాలో ఎక్స్-షోరూమ్ ధర 44,990 డాలర్ల(మన కరెన్సీలో రూ. 38.93 లక్షల)గా నిర్ణయించింది. ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యం ద్వారా 37,490 డాలర్లకు అమ్ముడవుతోంది. మోడల్ వై దిగుమతి ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించి, వడివడిగా ఉనికిని విస్తరించాలని టెస్లా భావిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో వేర్‌హౌస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. గురుగ్రామ్‌లోనూ మరిన్ని చోట్ల లీజుకు ప్రయత్నిస్తోంది.

Next Story