Tesla: భారత్‌లో తయారీపై టెస్లాకు ఆసక్తి లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామి

by S Gopi |

ఈవీ కార్ల తయారీ కోసం పథకాల కోసం జరిగిన సమావేశంలో టెస్లా ప్రతినిధులు మొదటి రౌండ్‌కు మాత్రమే హాజరయ్యారు.

Tesla: భారత్‌లో తయారీపై టెస్లాకు ఆసక్తి లేదు: కేంద్ర మంత్రి కుమారస్వామి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌లో తయారీపై ఆసక్తి చూపించటంలేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. సమీప భవిష్యత్తులో దేశీయంగా కార్ల తయారీ కోసం టెస్లా సిద్ధంగా లేదని, ప్రస్తుతం అమ్మకాలకే పరిమితం అవుతుందని అన్నారు. ఇప్పటికే కంపెనీ దేశీయ మార్కెట్లో షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోమవారం దేశంలో ఈవీ కార్ల తయారీ ప్రోత్సాహానికి కేంద్ర పథక మార్గదర్శకాలను కుమారస్వామి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తయారీ గురించి టెస్లా కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన వెల్లడించలేదు. దేశంలో ఈవీ కార్ల తయారీ కోసం పథకాల కోసం జరిగిన సమావేశంలో టెస్లా ప్రతినిధులు మొదటి రౌండ్‌కు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత రెండు, మూడు రౌండ్లకు వారు రాలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

కాగా, ఇటీవల టెస్లా కంపెనీ భారత మార్కెట్లో అమ్మకాలను ప్రారంభించేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో షోరూమ్‌ను కూడా ఖరారు చేసింది. స్టోర్ మేనేజర్లు, సర్వీస్ సిబ్బందితో సహా దేశీయంగా సుమారు పాతిక మందికి పైగా సిబ్బందిని నియమించింది. టెస్లా ఈవీలను విక్రయించడానికి కంపెనీ సర్టిఫికేషన్, హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. మరో రెండు నుంచి మూడు నెలల్లో మార్కెట్లో టెస్లా తన మొదటి ఈవీ కారును మనదేశంలో విడుదల చేయనుంది.

Next Story