India Economy: 2026 నాటికి 4వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: పరిశ్రమల సంఘం

by S Gopi |

గత మూడేళ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ నిలకడగా వృద్ధి చూస్తోందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ అన్నారు.

India Economy: 2026 నాటికి 4వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: పరిశ్రమల సంఘం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం, 2025-26లో 7.7 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల సంఘం పీహెచ్‌డీసీసీఐ తెలిపింది. తద్వారా 2026 నాటికి జాపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని వెల్లడించింది. గత మూడేళ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ నిలకడగా వృద్ధి చూస్తోందని, 2026 నాటికి జాపన్‌ను దాటగల సామర్థ్యం ఉందని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, వాణిజ్య సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థికవ్యవస్థ దీటుగా వృద్ధిని కొనసాగిస్తోందని పేర్కొంది. ప్రధాన ఐదు అంశాల ఆధారంగా భారత్ మెరుగైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు పీహెచ్‌డీసీసీఐ అభిప్రాయపడింది. మూలధన వ్యయం పెరగడం, వ్యాపార సౌలభ్యం, వ్యాపారాల్లో ఖర్చు తగ్గింపు, తయారీ ద్వారా రాబోయే సంవత్సరాల్లో దేశ వృద్ధి పథం అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో ప్రస్తుతం రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై విధిస్తున్న 30 శాతం గరిష్ఠ ఆదాయపు పన్నును, రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రానున్న బడ్జెట్‌లో మార్పులు చేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కూడా రూ. 10 లక్షలకు పెంచాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల చేతుల నుంచి ఖర్చు చేయగలిగే చర్యలు అవసరమని పరిశ్రమల సంఘం వెల్లడించింది.

Next Story