Gold Buy: పెట్టుబడి కోసమే బంగారం కొనుగోళ్లు

by S Gopi |

ప్రజలు ఆభరణాల కోసం కొనుగోలు చేసే వాటా తగ్గుతూ, పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Gold Buy: పెట్టుబడి కోసమే బంగారం కొనుగోళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం కొనుగోలు ధోరణిలో గణనీయమైన మార్పులు కనిపిస్తోంది. సంప్రదాయంగా ప్రజలు ఆభరణాల కోసం కొనుగోలు చేసే వాటా తగ్గుతూ, పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బంగారు వినియోగంలో పెట్టుబడి వాటా 40 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇది గతంతో పోలిస్తే స్పష్టమైన మార్పుగా కనిపిస్తోంది. 2025 నాటికి మొత్తం బంగారు కొనుగోళ్లలో ఆభరణాల వాటా 60 శాతం కంటే దిగువకు పడిపోయిందని, దీర్ఘకాల సగటు 70 శాతంతో పోలిస్తే ఇది తక్కువని నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ కీలక స్థానంలో ఉండటంతో, ఈ మార్పు నిర్మాణాత్మకమైన మార్పును సూచిస్తుందని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ అన్నారు. ఇందుకు ప్రధానంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, బంగారం ధరల పెరుగుదల, పెట్టుబడులను భిన్న సాధనాల్లో మళ్లించాలనే ప్రజల ఆలోచనా ధోరణి కారణాలుగా ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఈ అంశాలన్నీ కలిసి బంగారాన్ని 'స్వర్గధామ ' ఆస్తిగా మారుస్తున్నాయి. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ బార్, కాయిన్ రూపంలో పెట్టుబడులు పెరగడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని నివేదిక పేర్కొంది. అయితే, ధరలు పెరిగినా ఆభరణాల డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. 2025 నాటికి జ్యువెలరీ డిమాండ్ సుమారు 10 శాతం పెరిగి రూ. 4.8 లక్షల కోట్లకు చేరినట్లు నివేదిక చెబుతోంది. అంటే, పెట్టుబడులపై ఆసక్తి పెరిగినా, భారతీయుల బంగారంపై ప్రేమ ఇంకా బలంగానే కొనసాగుతోందని పేర్కొంది.

Next Story