Stock Market: 2025 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |

విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాలు కొనసాగినప్పటికీ, మన స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి.

Stock Market: 2025 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు 2025 ఏడాదికి మెరుగైన లాభాలతో వీడ్కోలు పలికాయి. గత నాలుగు సెషన్లుగా నష్టాలను చూసిన సూచీలు, బుధవారం దాదాపు 1 శాతం మేర పుంజుకున్నాయి. దీంతో 2025 ఏడాదికి సంబంధించి చివరి ట్రేడింగ్‌ రోజున లాభాలు నమోదయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాలు కొనసాగినప్పటికీ, మన స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మొత్తంగా 2025లో సెన్సెక్స్ 7,081.59 పాయింట్లు(9 శాతం), నిఫ్టీ 2,484.8 పాయింట్లు(10.50 శాతం) పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే 2025 ఆఖరి రోజున బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.476 లక్షలకు కోట్లకు చేరుకుంది. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 545.52 పాయింట్లు పెరిగి 85,220 వద్ద, నిఫ్టీ 190.75 పాయింట్లు ఎగసి 26,129 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టీఎంపీవీ షేర్లు అధిక లాభాలను సాధించాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 89.85 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు నష్టాల్లో ముగియగా, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీ లాభాల్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Next Story