Starlink: డేటా కాపీ, డీక్రిప్ట్ చేయకుండా స్టార్‌లింక్‌కు ప్రభుత్వ అనుమతులు

by S Gopi |

భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయడం కూడా తప్పనిసరి అని మంత్రి తెలిపారు.

Starlink: డేటా కాపీ, డీక్రిప్ట్ చేయకుండా స్టార్‌లింక్‌కు ప్రభుత్వ అనుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశాలలో భారతీయ డేటాను కాపీ, డీక్రిప్ట్ చేయకపోవడం వంటి భద్రతా షరతులతో సహా దేశీయ చట్టాలను పాటించడానికి స్టార్‌లింక్ కంపెనీ అంగీకరించిన తర్వాత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అంతేకాకుండా విదేశాలలో ఏర్పాటు చేసిన ఏదైనా వ్యవస్థలో భారతీయ వినియోగదారుల ట్రాఫిక్‌ రూటింగ్‌ నిషేధానికి కూడా కంపెనీ అంగీరించింది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయడం కూడా తప్పనిసరి అని మంత్రి తెలిపారు. ఈ ఎర్త్ స్టేషన్ గేట్‌వేల ద్వారా ఉపగ్రహం నుంచి వినియోగదారులకు ఇంటర్నెట్ నేరుగా మళ్లించడం వీలవుతుంది. అన్ని శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీలకు వర్తించే భద్రతా సూచనలతో సహా నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాతే స్టార్‌లింక్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) యూనిఫైడ్ లైసెన్స్(యూఎల్) మంజూరు చేసిందన్నారు. దేశంలో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయడం ద్వారా ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలలో డేటాను కాపీ చేయడం, డీక్రిప్షన్ చేయడం సాధ్యపడదు. దేశం వెలుపల ఉన్న ఏ సిస్టమ్ లేదా సర్వర్‌కు యూజర్ ట్రాఫిక్ పంపడం కుదరదని మంత్రి వివరించారు. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ ధరలతో సహా స్పెక్ట్రమ్ కేటాయింపు నిబంధనలు, షరతులపై టెలికాం శాఖ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి సిఫార్సులను కోరిందని చెప్పారు.

Next Story