Spicejet: ఆర్థిక సంక్షోభంతో స్పైస్‌జెట్‌లో ఉద్యోగాల కోత

by S Gopi |

కంపెనీ ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తాత్కాలిక సెలవులు, ఉద్యోగాల కోతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Spicejet: ఆర్థిక సంక్షోభంతో స్పైస్‌జెట్‌లో ఉద్యోగాల కోత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బడ్జెట్ క్యారియర్ సంస్థ స్పైస్‌జెట్ మరోసారి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జీతాలు చెల్లించలేకపోవడం, కార్యకలాపాలను కొనసాగించడానికి నిధుల కొరత కారణంగా సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ ఉద్యోగాల తొలగింపులు చేపట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య విమాన ఇంధన(ఏటీఎఫ్) ధరలు భారీగా పెరిగిన కారణంగా స్పైస్‌జెట్ తీవ్ర కష్టాల్లో ఉంది. ఏటీఎఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఆర్థిక సమస్యలను అధిగమించడం కష్టమని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తాత్కాలిక సెలవులు, ఉద్యోగాల కోతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సుమారు 6,800 మంది ఉద్యోగుల్లో తొలి దశలోనే 500 మందికి పైగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా. జీతాల చెల్లింపులు మూడు నెలల వరకు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సంస్థ కార్యకలాపాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఒకప్పుడు సుమారు 50 విమానాలు ఉండగా, ఇప్పుడు కేవలం 13 విమానాలకే పరిమితమైంది. పైలట్ల కాంట్రాక్టుల్లో మార్పులు, పని దినాల్లో పెరుగుదల వంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఇవి వారి ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం, సంస్థ మొత్తం బకాయిలు రూ. 4,500 కోట్లకు చేరే అవకాశం ఉండగా, సంస్థ కొత్త నిధుల కోసం ప్రయత్నిస్తోంది.

Next Story