- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Skoda: భారత మార్కెట్లోకి స్కోడా ఆక్టేవియా రీఎంట్రీ.. ఈ ఏడాది కోసం 100 కార్ల దిగుమతి
ఆక్టేవియా ఆర్ఎస్ ప్రీ-బుకింగ్‌లు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తన మొదటి తరం సెడాన్ మోడల్ ఆక్టేవియాను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇటీవల కంపెనీ విడుదల చేసిన తన కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్ కస్టమర్ల ఆదరణ పొందడంతో దేశీయ మార్కెట్లో మరింత దూకుడుగా పోటీ ఇచ్చేందుకు తన హై-ఎండ్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్‌ను తీసుకురానుంది. ఆక్టేవియా ఆర్ఎస్ ప్రీ-బుకింగ్‌లు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 6 నాటికి డెలివరీలు జరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది కోసం కంపెనీ పూర్తిగా తయారైన దాదాపు 100 కార్లను దిగుమతి చేసుకోనుంది. ఆ తర్వాత స్థానికంగా కారును అసెంబుల్ చేయడంపై దృష్టి సారిస్తుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఈ కారు ధర 39,965 యూరోలు (మన కరెన్సీలో రూ. 47.7 లక్షలు) ఉంది. అయితే, ఈ కారును పూర్తిగా తయారైన యూనిట్‌ను దిగుమతి చేస్తున్న నేపథ్యంలో మన మార్కెట్లో ధర ఇంకా ఎక్కువగా ఉండోచ్చని భావిస్తున్నారు.
స్కోడా తన సెడాన్ విభాగంలో ఆక్టేవియా కారును మొదటిసారిగా 2001లో లాంచ్ చేసింది. కార్బన్ ఉద్గారాల నిబంధనల కారణంగా 2023లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపేసింది. దేశంలో ప్రస్తుతం దాదాపు 1,00,000 ఆక్టేవియా కార్లు ఉన్నాయి. మళ్లీ ఇటీవల కంపెనీ నుంచి వచ్చిన కైలాక్ మోడల్ కారణంగా దేశీయ మార్కెట్లో స్కోడా బ్రాండ్‌కు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా కైలాక్‌కు డిమాండ్ కారణంగా స్కోడా ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య దాదాపు 30,000 కైలాక్ కార్లను విక్రయించింది. మిగిలిన మోడళ్లలో 17,000 కుషాక్, స్లావియా కార్లు ఉన్నాయి. జనవరి-ఆగస్టు మధ్య కంపెనీ అమ్మకాలు దాదాపు 135 శాతం పెరిగాయి.






