- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tax Cut: బడ్జెట్ పన్ను మినహాయింపుతో ఆర్థికవ్యవస్థకు 0.2 శాతమే ప్రయోజనం
ఆర్థిక వృద్ధికి పరిమితంగా మద్దతివ్వగలదని అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపును రికార్డు స్థాయిలో రూ. 12 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా వేతనజీవుల జేబుల్లోకి వెళ్లే రూ. లక్ష కోట్లు తిరిగి మార్కెట్లోకి వస్తాయని, ఫలితంగా వృద్ధి రేటు పెరుగుతుందని కేంద్రం భావించింది. అయితే, తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ ప్రకారం, ప్రభుత్వం రికార్డు స్థాయిలో పన్ను మినహాయింపు ప్రకటించినప్పటికీ, ఆర్థిక వృద్ధికి పరిమితంగా మద్దతివ్వగలదని అంచనా వేసింది. యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన ఐటీ మినహాయింపు ఫలితాలు ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో 10-20 బేసిస్ పాయింట్ల మేర పెరుగుదలకు మాత్రమే సహకరించనుంది. ఈ మేరకు మోతీలాల్ ఓస్వాల్ ఆర్థిక వేత్తలు నిఖిల్ గుప్తా, తనీషా లధా నివేదికలో పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి అనంతర పరిణామాలతో ప్రజలు పొదుపుపై ఎక్కువ దృష్టి సారించారు. ఆ తర్వాత కూడా ద్రవ్యోల్బణ ప్రభావం, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఎక్కువ శాతం మంది వివిధ రూపాల్లో రుణాలు తీసుకున్నారు. డేటా ప్రకారం, దశాబ్దం క్రితం సామాన్యుల వేతనంలో 35 శాతంగా ఉన్న అప్పు, ఇప్పుడు 52 శాతానికి పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంతో మినహాయింపు పరిధిలోకి వచ్చే సామాన్యులు, వేతనజీవులు ప్రధానంగా తమకున్న రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాబట్టి ప్రజలు ఖర్చు చేసే మొత్తం ఆర్థికవ్యవస్థకు తక్కువ మద్దతును మాత్రమే ఇవ్వగలదని వారు తెలిపారు. ప్రజల చేతిలో ఎక్కువ నగదు ఖచ్చితంగా ఖర్చును పెంచగలదు, కానీ దానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.






