Gold: లక్షన్నర దాటిన బంగారం

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.

Gold: లక్షన్నర దాటిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్న ఈ విలువ లోహాలు, మంగళవారం సరికొత్త మార్కును దాటాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మంగళవారం వెండి ధరలు రికార్డుల పరంపరను కొనసాగిస్తూ కిలో రూ. 3.2 లక్షలు దాటింది. ఇదే సమయంలో బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములకు రూ. 1.50 లక్షలకు పైన జీవితకాల గరిష్ట స్థాయికి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లోనూ, మార్చి డెలివరీ వెండి ఫ్యూచర్లు రూ. 9,674(3.2 శాతం) పెరిగి, కిలో రూ. 3.21 వద్ద కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఫ్యూచర్‌ మార్కెట్‌లో బంగారం ఫిబ్రవరి డెలివరీ ఒక్క రోజులోనే రూ.2,560 పెరిగి రూ.1.48 లక్షలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర తులం రూ. 3,540 పెరిగి రూ. 1,50,660కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 3,250 పెరిగి రూ. 1,37,300కి చేరింది. వెండి రూ. 15,000 పెరగడంతో కిలో రూ. 3.20 లక్షలకు చేరుకుంది.

ఇవీ కారణాలు

పసిడి, వెండి ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న, చేస్తున్న ప్రకటనలే కారణం. ముఖ్యంగా ఇరాన్, గ్రీన్‌ల్యాండ్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరు కారణంగా అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా మదుపర్లు బంగారం, వెండి లాంటి సురక్షితమైన సాధనాల్లో మదుపు చేస్తున్నారు. ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, వెనిజులాలో అమెరికా సైన్యం, గ్రీన్‌ల్యాండ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల తర్వాత నాటో చుట్టూ నెలకొన్ని ఆందోళనలు సహా తాజా అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ప్రపంచ సెంటిమెంట్ బలహీనంగా మారింది. ఇదే సమయంలో ఈవీలు, ఇతర ఇంధన రంగాలు, పారిశ్రామికంగా గిరాకీ అత్యధికంగా ఉండటంతో వెండి అత్యంత వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్ ఫ్యూచర్ మొదటిసారిగా ఔన్స్‌కు 4,700 డాలర్లను దాటింది. వెండి ఫ్యూచర్లు ఔన్సుకు 94.74 డాలర్లతో రికార్డు స్థాయికి పెరిగాయి.

Next Story