సిల్వర్ శివతాండవం.. ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా వెండి

by Naga Rani Yarlagadda |

బంగారం కంటే వెండి ధర పైపైకి పోతుండటం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

సిల్వర్ శివతాండవం.. ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం కంటే వెండి ధర పైపైకి పోతుండటం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా కిలో వెండి ధర రూ.3 లక్షలకు చేరువలో ఉంది. శనివారం (డిసెంబర్ 27) ఏకంగా రూ.20 వేలు పెరగడంతో..కిలో వెండి ధర రూ.2,74,000కు చేరింది. సిల్వర్ శివతాండవంతో మున్ముందు అందని ద్రాక్షగా మారుతుందా అన్న ఆందోళన మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తుల్లో వెండి మూడో స్థానానికి చేరింది. టెక్ దిగ్గజాలైన యాపిల్, ఆల్ఫాబెట్ లను అధిగమించి వెండి మూడో స్థానానికి చేరింది.

అత్యంత విలువైన ఆస్తుల్లో బంగారం రూ.2844 కోట్లతో తొలిస్థానంలో ఉండగా.. ఎన్వీడియా కార్పొరేషన్ రూ.413 కోట్లతో రెండో స్థానంలో ఉంది. రూ.380 కోట్లతో వెండి మూడో స్థానంలో ఉంది. త్వరలోనే ఎన్వీడియాను కూడా క్రాస్ చేసి.. అత్యంత విలువైన ఆస్తుల జాబితాలో వెండి రెండో స్థానాన్ని కైవసం చేసుకోనుంది. భారత మార్కెట్లో వెండి దూకుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2024 డిసెంబర్ 26న కిలో వెండి ధర రూ.91,600 ఉండగా.. ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి రూ.2,54,000కు చేరింది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 153 శాతానికి పైగా పెరిగింది. ఇదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.77,460 నుంచి రూ.1,39,233కు చేరుకుంది.

2026లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. మార్కెట్ నిపుణులు సైతం అలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్తున్నారు. వచ్చే ఏడాదిలో బంగారం ధర 10 గ్రాములు రూ.2 లక్షలు దాటుతుందని, కిలో వెండి రేటు కూడా సగటున రూ.5 లక్షలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story