గణనీయంగా తగ్గిన క్రెడిట్ కార్డుల ఖర్చులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-27 22:16:01  IST  )

ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి క్రెడిట్ కార్డుల ఖర్చులు గణనీయంగా తగ్గాయి.

గణనీయంగా తగ్గిన క్రెడిట్ కార్డుల ఖర్చులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది నవంబర్ నెలకు సంబంధించి క్రెడిట్ కార్డుల ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) రేట్ల తగ్గింపు, పండగ సీజన్ డిమాండ్ కారణంగా రెండు నెలల్లోనూ రూ.రెండు లక్షల కోట్ల క్రెడిట్ కార్డు వ్యయం నమోదైంది. మొత్తం క్రెడిట్ కార్డు ఖర్చులు నెలవారీగా రూ.2540 కోట్లు తగ్గి రూ.1.88 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే.. గతేడాదితో పోలిస్తే 11.5 శాతం పెరగడం విశేషం. అన్ని ప్రధాన కార్డ్ జారీదారులు నెలవారీగా ఖర్చుల్లో తగ్గుదల చూశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వ్యయం 10 శాతం, యాక్సిస్ బ్యాంక్(15.9 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్(15.8 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(15.2 శాతం) తగ్గినట్టు పేర్కొన్నాయి. కానీ, ఫెడరల్ బ్యాంక్ నవంబర్‌లో నెలవారీగా క్రెడిట్ కార్డుల వ్యయం 8శాతం పెరిగి రూ.41 కోట్లకు చేరుకున్నాయి. సాధారణంగా పండగ సీజన్‌లో బ్యాంకులు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించే వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల కారణంగా క్రెడిట్ కార్డ్ వ్యయం గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఆ తర్వాతి నెలలో ఈ ఆఫర్లు లేకపోవడం మూలంగా క్రెడిట్ కార్డు వ్యయంలో క్షీణత కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story