- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: నాలుగేళ్లలో రెట్టింపు పెరిగిన బంగారం నిల్వలు
డాలర్ విలువ పరంగా మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 11.70 శాతానికి పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) క్రమంగా బంగారం నిల్వలను పెంచుతున్న సంగతి తెలిసిందే. మన ఆర్‌బీఐ మాత్రమే కాదు చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇదే పనిచేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య విధానాల్లో సమస్యలు, అనేక దేశాల కరెన్సీలు బలహీనపడటం వంటి పరిణామాల మధ్య బంగారం నిల్వలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు గడిచిన నాలుగేళ్లలో రెట్టింపు పెరిగాయని సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. ఆర్‌బీఐ వద్ద ఈ ఏడాది మార్చి నాటికి డాలర్ విలువ పరంగా మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 11.70 శాతానికి పెరిగింది. ఇది 2024, సెప్టెంబర్ చివరికి 9.32 శాతం ఉండగా, 2021, మార్చి నాటికి 5.87 శాతంగా ఉండేదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆర్‌బీఐ వద్ద మొత్తం 879.59 మెట్రిల్ టన్నుల బంగారం ఉంది. అంతకుముందు సెప్టెంబర్ నాటికి 854.73 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. మొత్తం బంగారంలో 348.62 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద, 18.98 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్(బీఐఎస్) వద్ద సురక్షితంగా ఉన్నాయని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది. సెంట్రల్ బ్యాంకులు సాధారణంగా ఆర్థిక స్థిరత్వం కోసం, నష్ట భయాలను తగ్గించడానికి బంగారు నిల్వలను నిర్వహిస్తాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గులను అధిగమించేందుకు బంగారం సహకరిస్తుంది.






