Stock Market: మరోసారి భారీ పతనాన్ని చూసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |

అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు, ఇరాన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం, వృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది.

Stock Market: మరోసారి భారీ పతనాన్ని చూసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో రికార్డు షాయి పతనాన్ని చూసిన తర్వాత కోలుకుంటున్న సంకేతాలు కనిపించినప్పటికీ, బుధవారం సూచీలు మరోసారి వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు మిశ్రమంగా ఉండటం, ఇరాన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం, వృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను మదుపర్లు నిశితంగా గమనిస్తున్నారు. దీనికితోడు బుధవారం పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, అధిక చమురు ధరలు రవాణా, విద్యుత్, తయారీ ఖర్చులను పెంచుతాయనే ఆందోళనలు ఊపందుకోవడం, ఫలితంగా ద్రవ్యోల్బణం, వృద్ధికి విఘాతమనే సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, కీలక రంగాల్లో అమ్మకాల వల్ల స్టాక్ మార్కెట్లు పతనాన్ని చూశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1342.27 పాయింట్లు కుదేలై 76,863 వద్ద, నిఫ్టీ 394.75 పాయింట్లు క్షీణించి 23,866 వద్ద ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో, ఐటీ స్టాక్‌లలో భారీ అమ్మకాలు మార్కెట్‌ను దెబ్బతీశాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 5 లక్షల కోట్లను కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 440 లక్షల కోట్లకు చేరింది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం రూ. 4,672.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 91.97 వద్ద ఉంది.

Next Story