Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన ముహురత్ ట్రేడింగ్

by S Gopi |

ఈ పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే, వచ్చే ఏడాది దీపావళి కల్లా లాభాల పంట పండుతుందని విశ్వసిస్తారు.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన ముహురత్ ట్రేడింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లలో మంగళవారం జరిగిన ప్రత్యేక సెషన్ 'ముహురత్ ట్రేడింగ్' ఫ్లాట్‌గా సాగింది. దీంతో కొత్త సంవత్-2082 సానుకూలంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. దీపావళి పండుగకు ఏదైనా పని మొదలుపెడితే విజయం దక్కుతుందని పెట్టుబడిదారులు నమ్ముతారు. ఈ పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే, వచ్చే ఏడాది దీపావళి కల్లా లాభాల పంట పండుతుందని విశ్వసిస్తారు. ఈ కారణంగానే చాలామంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ముహురత్ ట్రేడింగ్‌లో పాల్గొంటారు. గంటపాటు జరిగిన ఈ ట్రేడింగ్‌లో భారీ ర్యాలీ లేకపోయినప్పటికీ, సూచీలు స్వల్ప లాభాలను సాధించాయి. దీంతో సెన్సెక్స్ 62 పాయింట్లు పెరిగి 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 25,868 వద్ద ముగిశాయి. ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కొత్త అకౌంట్ ఏడాది ప్రారంభానికి గుర్తుగా మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలైన ముహురత్ ట్రేడింగ్‌లో మొదట సెన్సెక్స్ 270 పాయింట్ల కంటే ఎక్కువగా ర్యాలీ చేసింది. నిఫ్టీ కూడా 25,900కి పైగా ఎగసింది. అయితే, కొద్దిసేపటి తర్వాత మార్కెట్లలో జోరు తగ్గింది. ఆఖర్లో ఒత్తిడి కారణంగా లాభాలు తగ్గాయి. కీలక బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి స్టాక్ రాణించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు బలహీనపడ్డాయి. కాగా, దీపావళి బలిప్రతిపద కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. తిరిగి గురువారమే మార్కెట్లు తెరుచుకుంటాయి.

Next Story