- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: భారత స్టాక్ మార్కెట్ల రికార్డు పతనం
2020 నాటి కొవిడ్-19 తర్వాత అత్యధికంగా 3,900 పాయింట్లకు పైగా కుదేలవగా, నిఫ్టీ వెయ్యి పాయింట్ల కంటే ఎక్కువగా పతనమయ్యాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు భారత ఈక్విటీ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. అంతర్జాతీయంగా అన్ని దేశాల మార్కెట్లలోనూ టారిఫ్ ప్రభావం కనిపించింది. ప్రపంచ మాంద్యం, ట్రంప్ పరస్పర సుంకాల వల్ల పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధ భయాల మధ్య పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దాంతో భారతీయ స్టాక్ మార్కెట్లు 'డార్క్ మండే'ను ఎదుర్కొనక తప్పలేదు. ఫలితంగా సెన్సెక్స్ ఇండెక్స్ 2020 నాటి కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల తర్వాత అత్యధికంగా 3,900 పాయింట్లకు పైగా కుదేలవగా, నిఫ్టీ వెయ్యి పాయింట్ల కంటే ఎక్కువగా పతనమయ్యాయి. ఆ తర్వాత స్వల్పంగా కోలుకునే ప్రయత్నాలు కనిపించినప్పటికీ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,226.79 పాయింట్ల నష్టతో 73,137 పాయింట్ల వద్ద, నిఫ్టీ 742.85 పాయింట్లు దెబ్బతిని 22,161 వద్ద ముగిశాయి. సోమవారం నాటి మార్కెట్ క్రాష్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు 52 వారాల్లోనే అత్యంత కనిష్టానికి, 10 నెలల్లోనే చెత్త సెషన్‌ను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల మరింత పతనం తప్పదని విశ్లేషలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న మార్కెట్లలో మదుపర్లు ఏకంగా రూ. 14 లక్షల కోట్లను నష్టపోయారు. అమెరికాలో మాంద్యం ఉంటుందనే భయాల మధ్య కీలక మెటల్, ఐటీ, రియల్టీ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. టాటా స్టీల్ ఏకంగా 7 శాతానికి పైగా నష్టపోయింది.
ట్రంప్ తెంపరితనంతో అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లకు నష్టాలు ఎదురయ్యాయి. టారిఫ్ నిర్ణయాలు గ్లోబల్ ట్రేడ్‌ను ఎటు దారితీస్తాయోననే ఆందోళనలే ఇందుకు కారణం. సోమవారం ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు అత్యధిక పతనాన్ని చూశాయి. అమెరికా, యూరప్ మార్కెట్లతో పాటు ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరగడం వల్ల ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్ ఇండెక్స్ అత్యధికంగా 13 శాతం పతనమైంది. ఆ తర్వాత జపాన్ నిక్కీ 8 శాతం, చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ 8 శాతం, సౌత్ కొరియాకు చెందిన స్టాక్ ప్రైస్ ఇండెక్స్ కోస్పి 6 శాతం క్షీణించాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 4.25 శాతం, అమెరికా నాస్దాక్ సైతం 6 శాతం వరకు పతనమైంది.
గరిష్ఠాల నుంచి రూ. 30 లక్షల కోట్ల నష్టం
ట్రంప్ టారిఫ్ ప్రభావంతో ఈ ఏడాది మార్చి 24 గరిష్ఠాల నుంచి స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 29.03 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. అత్యధికంగా ప్రభావితమైన మెటల్ రంగంలోని టాటా స్టీల్, వేదాంత, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు గరిష్ఠాల నుంచి 20 శాతం క్షీణించాయి.
భారత వృద్ధికి ఆటంకం?
ట్రంప్ టారిఫ్‌ల అమలు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, కంపెనీల లాభాలు తగ్గొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలను జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. అయితే, భారత ఆర్థికవ్యవస్థ ఇప్పటికే అత్యంత దారుణమైన పరిస్థితుల నుంచి బయటపడుతోందని గోల్డ్‌మ్యాన్ శాక్స్ తెలిపింది. ఇటీవలి నివేదికలో, భారత్ ఆర్థిక మందగమనం, కార్పొరేట్ ఆదాయాల క్షీణత వంటి అత్యంత కీలక సవాళ్లను అధిగమించింది. ఈ సమయంలో టారిఫ్ అమలు భారత ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ఉన్నప్పటికీ, అవకాశాలు కూడా లేకపోలేదని పేర్కొంది.
సెన్సెక్స్ టాప్-10 భారీ పతనాలు
* జూన్ 4, 2024 4390 పాయింట్లు
* మార్చి 23, 2020 3935 పాయింట్లు
* మార్చి 12, 2020 2919 పాయింట్లు
* మార్చి 16, 2020 2713 పాయింట్లు
* ఫిబ్రవరి 24, 2022 2702 పాయింట్లు
* ఏప్రిల్ 7, 2025 2,227 పాయింట్లు
* ఆగస్టు 5, 2024 2,223 పాయింట్లు
* మే 4, 2020 2002 పాయింట్లు
* మార్చి 9, 2020 1942 పాయింట్లు
* ఫిబ్రవరి 26, 2020 1939 పాయింట్లు
టాప్ 5 అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్‌లు
హర్షద్ మెహతా స్కామ్ 1992, ఏప్రిల్ 28 570 పాయింట్లు(12.7 శాతం)
కేతన్ పరేఖ్ స్కామ్ 2001, మార్చి 2 176 పాయింట్లు(4.13 శాతం)
2004 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2004, మార్చి 17 842 పాయింట్లు(15.52 శాతం)
ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008, జనవరి 21 1,408 పాయింట్లు(7.4 శాతం)
కొవిడ్-19 మహమ్మారి 2020, మార్చి 23 3,935 పాయింట్లు(13.2 శాతం)






