- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ దాదాపు 2,000 పాయింట్లు కోల్పోవడం మార్కెట్‌లో నెలకొన్న ఆందోళనలను ప్రతిబింబిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడం, ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం వంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,313 పాయింట్లు కుప్పకూలి 76,015 వద్ద ముగియగా, నిఫ్టీ 360.30 పాయింట్లు క్షీణించి 24,000 మార్క్ దిగువకు జారిపోయింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ దాదాపు 2,000 పాయింట్లు కోల్పోవడం మార్కెట్‌లో నెలకొన్న ఆందోళనలను ప్రతిబింబిస్తోంది. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లకు చేరుకోవడంతో, ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం చేసిన వ్యాఖ్యలు మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని చేసిన విజ్ఞప్తిని ఇన్వెస్టర్లు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడికి సంకేతంగా భావించారు. అధిక చమురు ధరలు, బలహీనపడుతున్న రూపాయి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ప్రమాదం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు రూ. 6 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 467 లక్షల కోట్లకు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పష్టత లేకపోవడం, డాలర్ బలపడటం, విదేశీ నిధులు తరలిపోవడంతో రూపాయి మారకం విలువ 72 పైసలు క్షీణించి రూ. 95.22 వద్ద ఉంది.






