భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Dishanational1 |
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు దేశీయ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి హెచ్ఎస్‌బీసీ కాంపోజిట్ పీఎంఐ డేటా 8 నెలల గరిష్ఠానికి చేరడం సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా అమెరికా ఫెడ్ బుధవారం నాటి ప్రకటనలో కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గించనున్నట్టు వెల్లడించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. ఫెడ్ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు సైతం పుంజుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 539.50 పాయింట్లు లాభపడి 72,641 వద్ద, నిఫ్టీ 172.85 పాయింట్ల లాభంతో 22,011 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫైనాన్స్, పబ్లిక్ రంగ బ్యాంకులు, మీడియా, మెటల్, ఫార్మా రంగాలు 1 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయిట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.14 వద్ద ఉంది.


Next Story

Most Viewed