Stock Market: 1,00,000 మార్కు చేరనున్న సెన్సెక్స్

by S Gopi |

ఏడాది ఆఖరు నాటికి కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,00,000 మార్కును చేరుకుంటుందని అంచనా వేసింది

Stock Market: 1,00,000 మార్కు చేరనున్న సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు క్రమంగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ రీ-రేటింగ్‌కు సిద్ధంగా ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఏడాది ఆఖరు నాటికి కీలక బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 1,00,000 మార్కును చేరుకుంటుందని అంచనా వేసింది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఫలితంగా స్టాక్ ధరలు పుంజుకునేందుకు అవసరమైన సానుకూల వాతావరణం మార్కెట్లలో కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకులు రుణాల జారీ సులభతరం చేయడం, వ్యవస్థలోకి మరింత నగదును చేర్చడం, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం కేటాయింపులు పెంచడం, పన్ను సంస్కరణలు వంటివి ఉన్నాయి. ఈ చర్యలన్నీ కంపెనీలు వేగంగా వృద్ధి చెందడానికి, ఎక్కువ లాభాలను ఆర్జించడానికి సహాయపడతాయి. తద్వారా స్టాక్ ధరలు పెరుగుతున్నాయి.

ఇదే సమయంలో ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత ఈక్విటీ మార్కెట్లు చౌకగా ఉండటం, ఇటీవల ర్యాలీ చేస్తుండటం, తాజాగా కొత్త గరిష్టాలకు చేరుతుండటం వల్ల భారతీయ స్టాక్‌లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఇవన్నీ మార్కెట్‌కు మద్దతు ఇస్తాయి. మెరుగుపడుతున్న వాణిజ్య సంబంధాలు, చైనాతో ఉద్రిక్తతలను తగ్గించడం కూడా స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలుగా మారుతున్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ దాదాపు 95,000కి చేరుకుంటుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. చమురు ధరలు తక్కువగా ఉండి ఆర్థిక వృద్ధి మరింత బలపడితే, డిసెంబర్ 10 నాటికి 1,00,000 దాటి 1,07,000 స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. అయితే, చమురు ధరలు బాగా పెరిగి వడ్డీ రేట్లు మళ్లీ పెరిగితే సెన్సెక్స్ దాదాపు 76,000 స్థాయికి పడిపోయే ప్రమాదం కూడా ఉందని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది.

Next Story