SEBI: ఇన్వెస్టర్లు జాగ్రత్త.. సెబీ పేరుతో మోసాలు

by S Gopi |

ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం గానీ, డబ్బు గాన్ని ఇవ్వొద్దని మదుపర్లను కోరింది.

SEBI: ఇన్వెస్టర్లు జాగ్రత్త.. సెబీ పేరుతో మోసాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మోసపూరిత పెట్టుబడి అవకాశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బుధవారం మదుపర్లను హెచ్చరించింది. సోషల్ మీడియాలో సెబీ పెరుతో ఉన్న లోగో, లెటర్‌హెడ్, సెబీ అధికారుల పేర్లను ఉపయోగించి మోసాలు జరుగుతున్నట్టు గుర్తించామని, అటువంటి వాటి పట్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోసపూరిత మెసేజ్‌లకు స్పందించవద్దని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం గానీ, డబ్బు గాన్ని ఇవ్వొద్దని మదుపర్లను కోరింది. సెబీకి చెందిన లెటర్‌హెడ్, లోగో, రెగ్యులేటర్ సీల్ ఉపయోగించి సెబీ అధికారి పేరున కొంతమంది పెట్టుబడిదారులను సంప్రదిస్తున్నట్టు సెబీ గుర్తించింది. కొన్ని సంఘటనలో సోషల్ మీడియా ద్వారా నోటీసులు జారీ చేసి, వారిపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే జరిమానా చెల్లించాలని అడుగుతున్నారు. మోసగాళ్లు తాము పీఏసీఎల్ గ్రూప్ ఆస్తులను కొంటున్నట్టు నకిలీ అమ్మకపు ధృవీకరణ పత్రాన్ని సృష్టించారని, థర్డ్ పార్టీ విక్రేత ఖాతాకు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారని సెబీ వివరించింది. ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లు, ప్రకటనల పట్ల ఇన్వెస్టర్లతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. పెట్టుబడిదారులు సెబీ నుంచి వచ్చినట్టుగా భావించే ఏదైనా సమాచారం ప్రామాణికతను ధృవీకరించడానికి అధికారిక వెబ్‌సైట్ చూడాలని తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్‌ను నమ్మండి

సెబీ జారీ చేసిన ప్రతి ఆర్డర్‌కు ఒక ప్రత్యేక రిఫరెన్స్ నంబర్ ఉంటుందని, అది ఉపయోగించే లేఖలు, నోటీసులు, షో-కాజ్ నోటీసులు, సమన్లు ​​వంటి అన్ని అధికారిక కమ్యూనికేషన్‌లకు ఒక ప్రత్యేక డాక్యుమెంట్ గుర్తింపు నంబర్ ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. అలాంటి అన్ని ఆర్డర్‌లు, అధికారిక కమ్యూనికేషన్‌లు, రికవరీ సర్టిఫికెట్‌లు వెబ్‌సైట్‌లో ఉంటాయి. అంతేకాకుండా, సెబీ నుంచి వచ్చినట్టుగా కనిపించే పత్రాల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడానికి వీలుగా సెబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సిస్టమ్‌ను సైతం అమలులోకి తెచ్చింది. సెక్యూరిటీ మార్కెట్‌లో మోసపూరిత పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, మోసం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్న కేసులు పెరుగుతున్న సమయంలో సెబీ ఈ హెచ్చరిక వచ్చింది.

Next Story