SEBI: నకిలీ యాడ్స్, ఫిన్‌ఫ్లూయెన్సర్ కంటెంట్‌ను ట్రాక్ చేసేందుకు ఏఐ టూల్ తీసుకొస్తున్న సెబీ

by S Gopi |

ఈ టూల్ ఆన్‌లైన్‌లో పెట్టుబడుల గురించి ఉండే అన్ని రకాల కంటెంట్‌ను పరిశీలిస్తుంది.

SEBI: నకిలీ యాడ్స్, ఫిన్‌ఫ్లూయెన్సర్ కంటెంట్‌ను ట్రాక్ చేసేందుకు ఏఐ టూల్ తీసుకొస్తున్న సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చట్టవిరుద్ధమైన లేదా తప్పుదారి పట్టించే యాడ్స్, సోషల్ మీడియా కంటెంట్‌ను గుర్తించి సమీక్షించడానికి కృత్రిమ మేధస్సు(ఏఐ)తో కూడిన వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనికి రెగ్యులేటరీ ఏఐ-డ్రైవెన్ అడ్వర్టైజ్‌మెంట్ రివ్యూయర్ (రా(ఏఐ)డార్) అనే పేరు పెట్టింది. ఈ టూల్ ఆన్‌లైన్‌లో పెట్టుబడుల గురించి ఉండే అన్ని రకాల కంటెంట్‌ను పరిశీలిస్తుంది. వాటిలో తప్పుడు, ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తక్షణం కనిపెడుతుంది. ఇటీవల సెబీ ట్రేడింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) పత్రాలను ప్రాసెస్ చేయడానికి, మార్కెట్ తీరును విశ్లేషించడానికి, పెట్టుబడుల సలహాదారులు, పరిశోధన విశ్లేషకులను పరిశీలించడానికి ఇన్-హౌస్ ఏఐ సాధనాల వినియోగాన్ని క్రమంగా విస్తరిస్తోంది. ఇటీవల, సెబీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే 1,00,000 కంటే ఎక్కువ అనుమానాస్పద పోస్ట్‌లను కనిపెట్టింది. వాటిని తొలగించడానికి మెటా, గూగుల్ వంటి కంపెనీలతో సెబీ కలిసి పనిచేస్తోంది. రా(ఏఐ)డార్‌తో సెబీ తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను వేగంగా పట్టుకోవాలని, తప్పుడు హామీ లేదా చెడు సలహాల ద్వారా తప్పుదారి పట్టకుండా సాధారణ పెట్టుబడిదారులను రక్షించాలని ఆశిస్తోంది.

Next Story