ఐపీఓ క్లియరెన్స్‌లో మరింత కఠినంగా సెబీ!

by Dishafeatures2 |
ఐపీఓ క్లియరెన్స్‌లో మరింత కఠినంగా సెబీ!
X

ముంబై: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్(సెబీ) ఐపీఓ ప్రక్రియలో మరింత కఠిన విధానాలను అనుసరిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇటీవల పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆరు కంపెనీలు ఇచ్చిన ప్రాథమిక పత్రాలను సెబీ తిరిగిచ్చింది. నిర్దిష్టమైన అప్‌డేట్ చేసిన వివరాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కంపెనీలకు స్పష్టం చేసింది. ఈ కంపెనీలు 2021, సెప్టెంబర్ నుంచి 2022, మే మధ్యకాలంలో తమ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్(డీఆర్‌హెచ్‌పీ) పత్రాలను అందజేశాయి.

అయితే, గతంలో అంటే 2021 మార్కెట్లలో మెరుగైన ర్యాలీ జరుగుతున్న సమయంలో ఐపీఓకు వచ్చిన పేటీఎం, జొమాటో, నైకా కంపెనీల వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఓ క్లియరెన్స్‌ విషయంలో సెబీ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిస్తూ, కొత్తగా అప్‌డేట్ చేసిన వివరాలతో తిరిగి దరఖాస్తు చేయాలని తెలిపింది. ఐపీఓ పత్రాలను వెనక్కి పంపిన కంపెనీల జాబితాలో ఆతిథ్య సేవల సంస్థ ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్, గోడిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, లావా ఇంటర్నేషనల్, పేమెట్ ఇండియా, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బీవీజీ ఇండియాలు ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 12,500 కోట్ల విలువైన నిధులను సమీకరించాలనే ప్రణాళికలను కలిగి ఉన్నాయి.



Next Story

Most Viewed