Rupee: మరోసారి రూ. 95 దాటిన రూపాయి మారకం

by S Gopi |

ఈ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరగడం. ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధిలో సరఫరా అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు పెరిగాయి.

Rupee: మరోసారి రూ. 95 దాటిన రూపాయి మారకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి గురువారం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కొత్త జీవితకాలపు కనిష్ట స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో రూపాయి రూ. 95.01 వద్ద ప్రారంభమై, రూ. 95.34 వరకు దిగజారింది. ఈ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరగడం. ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధిలో సరఫరా అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లను దాటి, ఓ దశలో 125 డాలర్లకు చేరాయి. అధిక చమురు ధరలు భారత దిగుమతి ఖర్చులను పెంచి, రూపాయిపై మరింత ఒత్తిడిని తెచ్చాయి.

మరోవైపు, అమెరికా డాలర్ బలపడటం కూడా రూపాయి పతనానికి తోడైంది. ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే డాలర్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గినా, గ్లోబల్ స్థాయిలో డాలర్ డిమాండ్ కొనసాగుతోంది. అదే సమయంలో, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) దేశీయ మార్కెట్లలో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే ఎఫ్‌పీఐలు రూ. 2,468 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం, కరెన్సీపై ఒత్తిడిని మరింత పెంచింది. ఇక, గురువారం ట్రేడింగ్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. క్రూడ్ ధరలు, రూపాయి బలహీనతతో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం ఒత్తిడి వంటి అంశాలు నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 582.86 పాయింట్లు క్షీణించి 76,913 వద్ద, నిఫ్టీ 180.10 పాయింట్లు పడిపోయి 23,997 వద్ద ముగిశాయి.

Next Story