- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rupee: రికార్డు కనిష్టానికి రూపాయి
ఏప్రిల్‌లో ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల తాత్కాలికంగా బలపడిన కరెన్సీ, ఇప్పుడు ఆ లాభాలను కోల్పోయింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్ఠానికి పతనమైంది. ముడి చమురు ధరలు భారీగా పెరగడం, విదేశీ పెట్టుబడుల తరలిపోవడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా బుధవారం రూపాయి 0.32 శాతం క్షీణించి డాలర్‌కు రూ. 94.85 వద్ద కొత్త కనిష్ట స్థాయికి చేరింది. ఏప్రిల్‌లో ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల తాత్కాలికంగా బలపడిన కరెన్సీ, ఇప్పుడు ఆ లాభాలను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజులోనే 3 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు సుమారు 115 డాలర్లకు చేరడం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచింది. భారత రూపాయితో పాటు ఫిలిప్పీన్ పెసో, ఇండోనేషియా రూపియా వంటి ఇతర ఆసియా కరెన్సీలు కూడా రికార్డు కనిష్టాలను తాకాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి 5.24 శాతం వరకు క్షీణించగా, డాలర్‌కు 94.10–95.15 మధ్య అస్థిరంగా ట్రేడ్ అవుతుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దిగుమతిదారుల నుంచి పెరిగిన డాలర్ డిమాండ్, దేశీయ లిక్విడిటీ కొరత కూడా రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్కెట్లో పెద్దగా జోక్యం చేసుకోకపోవడం కూడా కరెన్సీపై ఒత్తిడిని పెంచిందని ట్రేడర్లు చెబుతున్నారు.






