Rupee: చారిత్రాత్మక కనిష్టానికి రూపాయి పతనం

by S Gopi |

ఎక్కువ కాలం ఘర్షణల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింటుందనే భయంతో పెట్టుబడిదారులు రిస్క్ ఆస్తుల నుంచి వెనక్కి తగ్గుతున్నారు.

Rupee: చారిత్రాత్మక కనిష్టానికి రూపాయి పతనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి మంగళవారం మరోసారి ఆల్‌టైమ్ రికార్డు పతనాన్ని చూసింది. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లను భయాందోళనలకు గురి చేయడంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.63 వద్ద సరికొత్త కనిష్టానికి పడిపోయింది. అమెరికా శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ప్రకటించడం మార్కెట్లను మరింత కలవరపరిచింది. ఎక్కువ కాలం ఘర్షణల వల్ల ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింటుందనే భయంతో పెట్టుబడిదారులు రిస్క్ ఆస్తుల నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ఈ ప్రభావం భారత్‌పై మరింత తీవ్రంగా పడుతోంది. పెరుగుతున్న చమురు ధరలు పెద్ద సవాలుగా మారాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లను దాటడంతో, రూపాయి మరింత బలహీనపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఇంధన పొదుపు, దిగుమతుల నియంత్రణ పిలుపు మార్కెట్లలో ప్రత్యేక చర్చకు దారితీసింది. విశ్లేషకుల అంచనా ప్రకారం, చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రూపాయి 96 స్థాయిని కూడా చేరే అవకాశం ఉంది. అయితే ఆర్‌బీఐ జోక్యం రూపాయికి తాత్కాలిక మద్దతు ఇవ్వొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story