Air India: బోయింగ్ నుంచి 10 విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిర్ఇండియా

by S Gopi |

ఒప్పందం ఖరారైతే ఈ ఏడాది చివరి నాటికి విమానాలను ఎయిర్ఇండియాకు డెలివరీ చేయనుంది.

Air India: బోయింగ్ నుంచి 10 విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిర్ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియా పదుల సంఖ్యలో బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా, చైనా మధ్య రాజుకున్న టారిఫ్ వివాదం కారణంగా చైనా బోయింగ్ విమానాల కొనుగోలు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా తిరక్సరణతో బోయింగ్ వద్ద నుంచి 10 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ఇండియా చర్చలు ప్రారంభించింది. ఈ నారోబాడీ విమానాలను ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కోసం ఉపయోగించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఒప్పందం ఖరారైతే ఈ ఏడాది చివరి నాటికి విమానాలను ఎయిర్ఇండియాకు డెలివరీ చేయనుంది. అధిక సుంకాల కారణంగా చూపి చైనా కస్టమర్లు ఇకపై తమ విమానాలను డెలివరీ తీసుకునేందుకు నిరాకరించాయని బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ చెప్పారు. దీంతో డెలివరీ అవ్వని విమానాలను ఇప్పటికే ఆర్డర్ చేసిన ఇతర కస్టమర్లకు ఇచ్చే దిశగా కంపెనీ ఆలోచిస్తోందని ఆయన తెలిపారు.

అనుకున్న విధంగా ఒప్పందం పూర్తయితే ఎయిర్ఇండియాకు ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అనుకున్న సమయం కంటే చాలా తొందరగా విమానాల సంఖ్యను పెంచుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే బోయింగ్‌తో పాటు ఎయిర్‌బస్ నుంచి విమానాల డెలివరీలో ఆలస్యం వల్ల ఎయిర్ఇండియా కార్యకలాపాల్లో సమస్యలు ఉన్నాయి. కొత్త విమానాలు తొందరగా రావడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ, చైనాకు అవసరమైన విధంగా తయారైన విమానాల్లో సీటింగ్ లే్అవుట్‌లు, క్యాబిన్ ఫిట్టింగ్‌లు వేరుగా ఉంటాయి. ఎయిర్ఇండియా కొనుగోలు చేయాలంటే ప్రస్తుత విమానాల అవసరాలకు సరిపోయే మార్పులు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఒప్పందం జరిగినప్పటికీ ముందు అనుకున్న దానికంటే ధరల్లో వ్యత్యాసం ఉంటుందని సమాచారం.

Next Story