Reliance: తిరిగి రష్యా చమురు కొనుగోలు చేయనున్న రిలయన్స్

by S Gopi |   (  Updated:2026-02-11 12:24:02  IST  )

ఫిబ్రవరి నుంచి రోజుకు 1,50,000 బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేయనుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ గురువారం తెలిపారు.

Reliance: తిరిగి రష్యా చమురు కొనుగోలు చేయనున్న రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ రష్యా చమురు కొనుగోళ్లను ప్రారంభించనుంది. కంపెనీకి చెందిన జామ్‌నగర్‌లోని కాంప్లెక్స్ తిరిగి ఫిబ్రవరి నుంచి రోజుకు 1,50,000 బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేయనుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ గురువారం తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్‌నెఫ్ట్, లుకాయిల్‌పై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రిలయన్స్ ఈ కంపెనీలతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల కింద కొనుగోలు చేయడం కష్టంగా మారింది. రిలయన్స్ ఎగుమతులు, చెల్లింపులు, గ్లోబల్ వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.

దీంతో డిసెంబర్ తర్వాత రిలయన్స్ రష్యా చమురు కొనుగోలు చేయడం నిలిపేసింది. తాజాగా రిలయన్స్ అమెరికా ఆంక్షల కింద లేని రష్యా కంపెనీల నుంచి ముడిచమురు కొనుగోలు చేయనున్నట్టు చెబుతోంది. అయితే, దీనిపై కంపెనీ అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది. రష్యా చమురు ఇతర దేశాల చమురు కంటే చౌకగా ఉండటంతో కంపెనీ ఆంక్షలకు అనుగుణంగా అమెరికా నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న రష్యా కంపెనీల నుంచి కొనుగోళ్లు నిర్వహించనుంది. ఇక, రష్యా నుంచే కాకుండా సౌదీ అరేబియా, ఇరాక్, కెనడా దేశాల నుంచి కూడా చమురు కొంటోంది. అయితే, పెద్ద రష్యా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో వెనిజులా చమురును మళ్ళీ కొనుగోలు చేయాలని కూడా రిలయన్స్ భావిస్తోంది. దీనికోసం అమెరికా ఆమోదం పొందడానికి కూడా ఇది ప్రయత్నిస్తోంది.

Next Story