RBI: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ‘శాశ్వత’ డైరెక్టర్లకు ఆర్‌బీఐ బ్రేక్

by S Gopi |

పదవీకాలం పూర్తయిన సమయంలో కూడా తప్పనిసరిగా మూడేళ్ల 'కూలింగ్-ఆఫ్' తర్వాతే మళ్లీ అదే బ్యాంకు బోర్డులోకి ఎన్నిక కావడానికి అర్హత ఉంటుందని ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.

RBI: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ‘శాశ్వత’ డైరెక్టర్లకు ఆర్‌బీఐ బ్రేక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల (యూసీబీ) బోర్డులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. యూసీబీల బోర్డులో ఒక వ్యక్తి వరుసగా 10 సంవత్సరాలకు మించి డైరెక్టర్‌గా కొనసాగడానికి వీలులేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పదవీకాలం పూర్తయిన సమయంలో కూడా తప్పనిసరిగా మూడేళ్ల 'కూలింగ్-ఆఫ్' తర్వాతే మళ్లీ అదే బ్యాంకు బోర్డులోకి ఎన్నిక కావడానికి అర్హత ఉంటుందని ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. కొన్ని యూసీబీల్లో డైరెక్టర్లు తమ పదవులకు తాత్కాలికంగా రాజీనామా చేసి, అతి తక్కువ వ్యవధిలోనే తిరిగి ఎన్నికవడం, తద్వారా చట్టపరంగా అనుమతించిన కాలపరిమితికి మించి సుదీర్ఘకాలం పాటు బోర్డులో కొనసాగుతున్నారని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ తరహా పద్ధతులకు చెక్ పెట్టడమే తాజా నిబంధనల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ‘కూలింగ్-ఆఫ్’ కాలంలో సదరు మాజీ డైరెక్టర్‌కు ఆ బ్యాంకు సభ్యుడు లేదా కస్టమర్‌గా తప్ప మరే విధమైన అధికారిక సంబంధం ఉండకూడదు. అయితే ఇతర అర్హతలు ఉంటే వేరే బ్యాంకు బోర్డులో డైరెక్టర్‌గా నియమితులవ్వడానికి ఈ పరిమితి అడ్డంకి కాదని ఆర్‌బీఐ తెలిపింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్‌సీబీ)కు కూడా ఆర్‌బీఐ ఇదే తరహా మార్గదర్శకాలను జారీ చేసింది.

Next Story